ఇద్దరు బాలురను కాపాడిన లైఫ్‌గార్డులు
భీమునిపట్నం: భీమిలి తీరంలో మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు అప్రమత్తంగా వ్యవహరించి ఇద్దరు బాలురను రక్షించారు. పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జశ్వంత్, కర్రి అజయ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భీమిలి బీచ్‌కు వచ్చారు. వీరు సరదాగా సముద్రంలో స్నానానికి దిగగా.. ఒక్కసారిగా అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన మైరెన్ పోలీసులు, లైఫ్‌గార్డులు వెంటనే స్పందించారు. వేగంగా నీటిలోకి వెళ్లి ఆ బాలురిద్దరినీ క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. మైరెన్ సీఐ శ్రీనివాసరావు ఆ బాలురను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రమాదకరమైన తీర ప్రాంతాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


