వై.రామవరం: మండలంలోని చవిటిదిబ్బలు , దేవరమడుగుల గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో ఆదివారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలు పాలయ్యారు. మండలంలోని పి.యర్రగొండ గ్రామానికి చెందిన జల్లు బుజ్జిబాబు(19) దేవరమడుగులు గ్రామం వైపు నుంచి ఒక బైక్‌పై వస్తుండగా, గొడుగు రాయి గ్రామానికి చెందిన కురసం విశ్వతేజ , అదే గ్రామానికి చెందిన ఈక ఈశ్వరదొరలు ఇద్దరు మరోబైక్‌పై చవిటిదిబ్బలు గ్రామం నుంచి వెళ్తుండగా, మార్గమధ్యలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు బలంగా ఢీకొన్నాయి. దీంతో పి.యర్రగొండ గ్రామానికి చెందిన జల్లు బుజ్జిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోబైక్‌పై వస్తున్న ఇద్దరు తీవ్రగాయాలు కాగా, వారిని 108లో స్థానిక సీహెచ్‌సీకు తరలించారు. అక్కడ వైద్యాధికారి జీవన్ తదితరులు వైద్య సేవలు అందించి, మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్యకుమార్ తెలిపారు. ప్రమాద సంఘటన స్థలానికి ఎస్‌ఐ బి.రామకృష్ణ, సిబ్బంది వెళ్లారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బి.రామకృష్ణ తెలిపారు. మోటారు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


