శిథిలావస్థలో జీసీసీ గోదాములు
● ఎలుకల బారిన పడి పాడవుతున్న నిత్యావసర సరకులు
● నిర్వాహకుల అవస్థలు
● పట్టించుకోని అధికారులు
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ఉన్న జీసీసీ గోదాములు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.గోడలు బీటలు వారి, పైకప్పు, గచ్చులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గచ్చుకు ఎలుకలు రంథ్రాలు ఎక్కువై జీసీసీ గోదాము ఎలుకుల నివాసం గృహాలుగా మారిపోయింది. 23 పంచాయతీలకు సరఫరా చేసే నిత్యవసర సరకులు నిల్వ చేసే జీసీసీ గోదాములు ఆధ్వానంగా ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. గత కొన్ని రోజులుగా ఎలుకలు గోదాములో ఉన్న పప్పులు, కారం, పసుపు, సబ్బులు వంటి సరకుల ప్యాకెట్లను, బస్తాలను కొరికి పాడుచేసి, నేలపాలు చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి రోజు ఇదే జరుగుతుండడంతో సరకులు నిల్వ చేసేందుకు, ఎలుకుల నుంచి రక్షణ జీసీసీ నిర్వాహకులు నానా పాట్లు పడుతున్నారు. స్థానిక జీసీసీ గోదాములు నిర్మించి 50ఏళ్లుకు పైగా అవుతుంది. నిత్యం భయపడుతూ జీసీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి జీసీసీ గోదాముల నూతన భవనాలకు నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.
శిథిలావస్థలో జీసీసీ గోదాములు


