పెళ్లికి నిరాకరించిన ప్రియుడు యువతి ఆత్మహత్యాయత్నం
గాజువాక : ప్రేమించిన వ్యక్తితో పోలీసులు పెళ్లి చేయలేదనే బాధతో ఓ యువతి గాజువాక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి ప్రాంతానికి చెందిన సీహెచ్ దుర్గాభవాని, అనకాపల్లి ప్రాంతానికి చెందిన వీరయ్యస్వామి అచ్యుతాపురం ప్రాంతంలోని ఒక సంస్థలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారిమధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత దుర్గాభవాని అచ్యుతాపురంలో పని మానేసి గాజువాకలోని ఒక షాపింగ్ మాల్‌లో పని చేస్తూ శ్రీనగర్‌లోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని వీరయ్య స్వామిపై ఒత్తిడి తెచ్చింది. ఏడేళ్లపాటు కలిసి తిరిగిన తరువాత అతడు వివాహానికి నిరాకరించడంతో పాటు ముఖం చాటేశాడు. దీంతో దుర్గాభవాని పది రోజుల క్రితం గాజువాక పోలీసులను ఆశ్రయించి తన ప్రియుడితో వివాహం జరిపించాలని పట్టుబట్టింది. అయితే పోలీసులు పెళ్లి చేయడం లేదని బాధతో ఆదివారం తనతోపాటు తెచ్చుకున్న నెయిల్‌పాలిష్‌ను తాగింది. దీన్ని గమనించిన పోలీసులు ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాజువాక సీఐ పార్థసారధి ఆస్పత్రికి వెళ్లి దుర్గాభవానిని విచారించారు. ప్రియుడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపగా.. ఫిర్యాదు చేయడానికి ఆమె ఇష్టపడలేదు. ప్రియుడితో వివాహం మాత్రమే జరిపించాలని కోరింది. ఈ విషయంపై ప్రియుడు వీరయ్యస్వామితో పోలీసులు మాట్లాడుతున్నారు.


