
గిరి విద్యార్థుల ఆశలకు విఘాతం
చింతపల్లి: గిరిజన విద్యార్థుల అశనిపాతంలాంటి వార్త.. వారి బంగారు భవిష్యత్తుకు విఘాతం కలిగిస్తూ చింతపల్లిలోని సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వును జారీ చేసింది. ఈ విద్యాసంవత్సరం (2025–26) నుంచే ప్రవేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తున్నారు. దశాబ్దన్నర కాలం క్రితం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను నెలకొల్పారు. ఉత్తరాంధ్రకు మూడు మంజూరు కాగా అందులో ఏజెన్సీలో ప్రారంభించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఇదొక్కటే. మన్య ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా భావించిన అధికారులు 2011లో చింతపల్లిలో ఉన్న ఎన్‌జీ రంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ప్రారంభం నుంచి 30మంది విద్యార్థులతో 2024–25 విద్యాసంవత్సరం వరకూ 14 సంవత్సరాలపాటు నిర్విరామంగా కొనసాగింది. దీనిని రాష్ట్రంలోనే ఏకై క సేంద్రియ వ్యవసాయ కళాశాలగా 2014–15 సంవత్సరంలో మార్పు చేశారు. గడిచిన 14 ఏళ్లుగా ఈ కళాశాలలో విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఈ కళాశాలలో ప్రతి ఏడాది 10 నుంచి 15 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
అగ్రిటెక్‌లో ప్రతి ఏడాది అగ్రస్థానం
చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు గడిచిన ఐదేళ్లుగా మొదటి ర్యాంకులను సాధిస్తున్నారు. ఇక్కడ కళాశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కలిగిన విద్యతోపాటు అన్ని రకాలైన ప్రయోగాలతో ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. దాంతో ఈ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు.
40 లక్షలతో అత్యాధునిక విద్యా సౌకర్యాలు
ఈ కళాశాలలో విద్యార్థుల కోసం రూ.40 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన విఽశాలమైన పాఠశాల గదులు, డిజిటల్ బోర్డులు, ప్రయోగశాలలు, సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. గిరి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ కళాశాలను.. ప్రవేశాలు ఆశించినంత లేవని కుంటిసాకు చూపుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించడాన్ని ఈ ప్రాంతవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయ
పాలిటెక్నిక్ కళాశాల మూసివేత
ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని జీవో విడుదల

గిరి విద్యార్థుల ఆశలకు విఘాతం