ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రారంభించిన ఈ కళాశాల తమలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరారు. – చింతపల్లి
పేదబిడ్డలకు ఎంతో నష్టం
చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేస్తే మాలాంటి ఎంతో మంది పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మాది బీసీ వర్గానికి చెందిన చిన్నపాటి వ్యవసాయ కుటుంబం. మాకున్నటువంటి మూడు ఎకరాల మెట్ట భూమిలో వేరుశనగ, మిర్చి పంటలను మాతల్లిదండ్రులు కష్టపడి పండించి నన్ను చదివించారు. మా కుటుంబ నేపథ్యం దృష్టిలో పెట్టుకుని సేంద్రియ వ్యవసాయ విద్యపై మక్కువ పెంచుకుని సుదూర ప్రాంతమైన చింతపల్లి వచ్చి చదువుకుంటున్నా. ఇపు్పుడు కళాశాలను మూసివేస్తున్నారని తెలిసేసరికి మాలాంటి పేద విద్యార్థులు ఇలాంటి విద్యను అభ్యసించే అవకాశం దూరం అవుతుంది.
– ఎ.అక్షయ, తొర్రివేమల,
మైలవరం మండలం, వైఎస్సార్ కడప జిల్లా
ఉచితంగా అభ్యసించేవీలు లేనట్టే
వ్యవసాయ విద్యను ఉచితంగా అభ్యసించే అవకాశం లేకుండా పోయినట్టే. మాది చిన్న పాటి కుటుంబం. మా తండ్రి మెకానిక్‌గా పనిచేస్తూ మరోపక్క అర ఎకరాలో వ్యవసాయం చేస్తూ వచ్చే ఆదాయంతో నన్ను చదివించారు. వ్యవసాయ విద్యలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని అందరూ చెబుతుండటంతో ఇక్కడ జాయిన్ అయ్యా. ఉచితంగా చదువుకుంటున్నా. ఇక్కడ ఎంతో బాగా చెబుతున్నారు. ప్రాక్టికల్‌గా కూడా చేయిస్తున్నారు. ఇటువంటి కళాశాలను ఎత్తివేస్తే మాలాంటి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎన్నో అవస్థలు పడాలి. దీనివల్ల పేద విద్యార్థులకు వ్యయసాయ విద్య దూరమయ్యే పరిస్థితి ఉంది.
– వి.రూప, భీమవరం,
అడ్డతీగల మండలం, ఏఎస్సార్ జిల్లా
గిరిజన విద్యార్థులకే ఎక్కువ అన్యాయం
కళాశాలను మూసివేస్తే ఈ ప్రాంత గిరిజన విద్యార్థులకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది. గతంలో ఈ వ్యవసాయ విద్యపై ఏజెన్సీ ప్రాంతంలో అంతగా అవగాహన లేదు. మాకున్న ఎకరా భూమిలో చేపట్టాల్సిన పంటలకు సంబంధించి పరిశోధన స్థానం శాస్‌త్రవేత్తలు వచ్చి మా తండ్రికి వ్యవసాయ సూచనలు ఇచ్చేవారు. నన్ను కూడా వ్యవసాయ విద్యలో చేర్చాలని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేవారు. ఎంతో ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ చదివి సీటు సంపాదించా. వ్యవసాయ విద్యను మన ప్రాంతంలోనే ఉచితంగా అన్ని సౌకర్యాలతో పొందుతున్నా. ఇటువంటి కళాశాలను ఎత్తివేస్తే గిరిజన విద్యార్థులకు తీరని అన్యాయం చేసినట్టే.
– కె. స్పందన, లోతుగెడ్డ, చింతపల్లి మండలం