
సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కొనసాగించేలా చర్యలు
చింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహిస్తున్న సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్‌ను యథావిధిగా కొనసాగించేలా సంబంధిత అదికారుల చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని సంధర్శించారు. ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి,శాస్త్రవేత్తలు,పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 2011లో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఈ కళాశాలను మంజూరు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా చింతపల్లిలో 3బ్రాంచ్‌లతో 60 మంది విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి ఇచ్చామన్నారు. అదేవిధంగా ఈ కళాశాలకు 12 ఎకరాలు స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైన సౌకర్యాలు లేనందున చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని కుంటుసాకులు చూపుతూ ప్రవేశాలు నిలిపివేయడం దారుణమన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగితే వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక్కడ వ్యవసాయ పాలిటెక్నిక్ లేనప్పుడు ఈ ప్రాంత విద్యార్థులు తిరుపతి, నైరా, బాపట్ల, జగిత్యాల తదితర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేవారన్నారు. ఈ పరిస్థితుల్లో ఎత్తివేయడం ఎంతో బాధాకరమన్నారు. ఇప్పటికే చింతపల్లిలో డెయిరీ ఫారం, పట్టుపరిశ్రమ కార్యాలయాన్ని ఎత్తివేశారని అన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు పునరాలోచించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు విజ్ఞప్తి