
ఏయూను సందర్శించిన ఐసాయ్ ప్రతివిధులు
మద్దిలపాలెం: ఐసాయ్(ఈఐఎస్‌ఏఐ) గ్లోబల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(టోక్యో) మకోటో హొకెట్సు, ఇతర ప్రతినిధులు ఏయూను గురువారం సందర్శించారు. వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ విభాగాల ఆచార్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐసాయ్ ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ) నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. వీసీ మాట్లాడుతూ విశాఖ నగరం అన్ని విధాలా జీసీసీకి అనుకూలమన్నారు. ఏయూ తరఫున ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తామని తెలిపారు. ఇంటర్న్‌షిఫ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో ఐసాయ్ మేనేజింగ్ డైరెక్టర్ కియో టోడా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గిరీష్ దీక్షిత్, సంస్థ తరఫున ఐటీ ఇండియా హెడ్ జోసఫ్ కిరణ్ కుమార్, ఆచార్య శశి, డీన్ ఔట్రీచ్ ఆచార్య కె.రమసుధ తదితరులు పాల్గొన్నారు.