
విశాఖలో క్రికెట్ పండగ
విశాఖ స్పోర్ట్స్: విశాఖ క్రికెట్ అభిమానులకు పండగే పండగ. రాబోయే కొద్ది నెలల పాటు నగరం క్రికెట్ జాతరతో హోరెత్తనుంది. స్థానిక ప్రతిభకు పట్టం కట్టే ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నుంచి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యాచ్‌ల వరకు.. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం అంతులేని ఉత్సాహానికి వేదిక కానుంది.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) నాలుగో సీజన్‌తో ఈ క్రికెట్ సందడి మొదలుకానుంది. ఈ సీజన్ అనేక మార్పులతో అభిమానులను అలరించడానికి సిద్ధమైంది. గత మూడు సీజన్లకు ప్రాతినిధ్యం వహించిన ఆరు జట్ల స్థానంలో ఏసారి ఏడు సరికొత్త ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఈ సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్య 15 నుంచి 25కి(నాలుగు ప్లేఆఫ్‌లతో సహా) పెరిగింది. ఇది టోర్నీలో మరింత పోటీని, ఉత్కంఠను నింపనుంది. ఈ సారి ఏపీఎల్ వేలంలో అండర్–16 ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించడం ఒక విశేషం. ఐపీఎల్‌లో సూర్యవంశీ వంటి యువకులు రాణించడంతో.. స్థానిక ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జట్టులో ఇద్దరు అండర్–19 ఆటగాళ్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన కూడా ఉంది. అండర్–16 విషయంలో ఫ్రాంచైజీలదే తుది నిర్ణయం. ఈ నెల 14న 520 మంది ఆటగాళ్లతో భారీ వేలం జరగనుంది. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్లను ‘ప్రత్యేక కేటగిరీ’లో, మిగిలిన వారిని వారి స్థాయిని బట్టి ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఆగస్టు 8న టోర్నీ ప్రారంభమవుతుందని ఏపీఎల్ నిర్వాహక కమిటీ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ కార్యదర్శి సతీష్‌బాబు తెలిపారు. కాగా.. ఏపీఎల్ ప్రారంభానికి ముందే, రాష్ట్ర స్థాయి క్రీడాకారిణులతో మూడు జట్లుగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా ఐదు మ్యాచ్‌లకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్–అక్టోబర్ మాసాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏపీఎల్, మహిళల క్రికెట్ టోర్నీల తర్వాత కూడా విశాఖలో క్రికెట్ సందడి కొనసాగనుంది. డిసెంబర్ 6న భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లో తలపడనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో టీ–20 మ్యాచ్ జరగనుంది.
ఏపీఎల్ నుంచి అంతర్జాతీయ
మ్యాచ్‌ల వరకు ఆతిథ్యం
ఆగస్టు 8 నుంచి ఏపీఎల్
అక్టోబర్‌లో మహిళల వరల్డ్ కప్
డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వన్డే