
మేలు జాతి పశువుల కోసం..
● గుజరాత్ ఎన్డీబీ సహకారంతో లింగ నిర్ధారిత వీర్యం అభివృద్ధి ● 15 నుంచి 498 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో వీర్యం పంపిణీ ● ఈ ఇంజక్షన్ ద్వారా 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం
సాక్షి, అనకాపల్లి: మేలు జాతి పశువులు వృద్ధి చెందేలా లింగ నిర్ధారిత వీర్యం అభివృద్ధికి కేంద్ర పశుసంవర్థక శాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలో పాడి పశువుల సంఖ్యను పెంచి అన్నదాతకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే గుజరాత్‌లో గల న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సహకారంతో మేలు జాతి వీర్యం తక్కువ ధరకు అందించి అన్నీ పెయ్యదూడలు పుట్టేలా వీర్యం పంపిణీ చేస్తోంది. రూ.150కే లింగ నిర్ధారిత పశు వీర్యం ఇంజక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 4,330 డోసులను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 50 వేల డోసులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్ల పంపిణీని ఈ నెల 15న ప్రారంభించనున్నారు. గేదెలు, ఆవులకు ఆడ దూడలు మాత్రమే పుట్టేలా చేయడమే దీని ఉద్దేశం. దీనివల్ల 90 శాతం అధిక పాలసార గల పెయ్యదూడలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది. పెయ్యదూడ పెరిగి మూడున్నరేళ్లకు గర్భం దాల్చేనాటికి దాని విలువ రూ.లక్షకు చేరుతుంది. అప్పట్నుంచి ఏటా ఒక్కో పెయ్యదూడను ఈనుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈనెల 15న 498 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో లింగ నిర్ధారిత వీర్యం పంపిణీ ప్రారంభించనున్నామని పశుగణాభివృద్ధి జిల్లా కార్యనిర్వాహణాధికారి బెహరా ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.