
వైభవంగా నిత్యకల్యాణం
సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామికి శనివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30గంటల నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.
భక్తులతో సింహగిరి కిటకిట
సింహాచలం (విశాఖ) : సింహగిరి శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. రెండవ శనివారం సెలవురోజు కావడంతో పలుపాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణరోజు 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి, సింహగిరిపైకి వెళ్లని పలువురు భక్తులు కూడా వచ్చారు. భక్తులతో దర్శన క్యూలు, ప్రసాద విక్రయశాల, కేశఖండనశాల, బస్సులు, అన్నప్రసాద భవనం కిటకిటలాడాయి.