
మీకోసంలో 128 వినతుల స్వీకరణ
పాడేరు : స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 128 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఇంచార్జీ డీఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. సంబంధిత శాఖ అధికారులు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జనార్దనరావు, జిల్లా ట్రెజరీ అధికారి ప్రసాదరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమేష్‌కుమారరావు, డీఎల్‌పీవో కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.