
పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ముంచంగిపుట్టు: పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దరి చేరవని జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి అన్నారు.మండలంలోని అత్యంత మారుమూల రంగబయలు పంచాయతీ లంగాబపోదోర్ గ్రామానికి చెందిన కొర్ర రంజిత(6) ఈ నెల 8న మలేరియాతో మృతి చెందడంతో శుక్రవారం జిల్లా మలేరియా అధికారి లంగాబపోదోర్ గ్రామాన్ని సందర్శించారు.రంజిత తల్లిదండ్రులు శంకర్‌రావు,బుధోయ్‌లతో మాట్లాడి మృతి చెందకముందు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.12 రోజుల పాటు జ్వరం బాధపడినట్టు తల్లిదండ్రులు తెలియజేశారు. రంజితకు అందిన వైద్య సేవలు,అందించిన మందులు తదితర వివరాలు సేకరించారు.అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి గిరిజనులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.గ్రామంలో పలుచోట్ల మురుగునీరు నీల్వ ఉండడం,పారిశుధ్యం లోపించడంతో గ్రామస్తులతో శుభ్రం చేయించారు.రంగబయలు పంచాయతీలో ఆశా కార్యకర్తలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో వస్తున్న అనారోగ్య సమస్యలపై తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి గ్రామస్తులతో మాట్లాడుతూ వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,దోమ తెరలు వినియోగించాలని,అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను,సిబ్బందిని సంప్రదించి,వైద్య సేవలు పొందాలని,నాటు వైద్యం జోలికి పోకూడదని సూచించారు.అనంతరం లబ్బూరు పీహెచ్‌సీ,ముంచంగిపుట్టు సీహెచ్‌సీలను తనిఖీ చేశారు. సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్న లంగాబపోదోర్ గ్రామానికి చెందిన జ్వర బాధితులతో మాట్లాడి ప్రస్తుత అరోగ్య పరిస్థితి,అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు శ్యాంప్రసాద్,వివేక్,ఎంపీహెచ్‌వో సుబ్రహ్మణ్యం,హెల్త్ అసిస్టెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మలేరియా అధికారి తులసి

పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరం