
గంజాయి రహిత మన్యమే లక్ష్యం
పోక్సో కేసులో యువకుడి అరెస్ట్
సబ్బవరం: బాలిక అదృశ్యం కేసులో స్థానిక పోలీసులు ఓ యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ జి.రామచంద్రరావు తెలిపిన వివరాలు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని బుడారిసింగ్ గ్రామానికి చెందిన పసుపులేటి హరిబాబు కుటుంబ సభ్యులతో సబ్బవరంలోని సాయినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ, అసకపల్లి ప్రాంతంలో నర్సరీ నడుపుతున్నాడు. అతని కుమారుడు తేజ(19) తాము అద్దెకు ఉంటున్న యజమాని కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. మే నెలలో ఎవరికీ తెలియకుండా బాలికను అపహరించుకు పోవడంతో బాలిక తండ్రి సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒడిశా రాష్ట్రంలో ఉన్న తేజను గురువారం పట్టుకుని, బాలిక స్టేట్‌మెంట్ మేరకు అరెస్ట్ చేశారు. అతనితో పాటు పట్టుబడిన బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అరెస్టు చేసిన యువకుడిని రిమాండ్‌కు తరలించారు.
పాడేరు : గంజాయి రహిత మన్యానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇప్పటికే జిల్లాలో పోలీసులు, ఈగల్ సిబ్బంది గంజాయిని సమూలంగా నిర్మూలించడం ఆనందంగా ఉందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్యం–2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల నుంచి రూ.3కోట్ల 73 లక్షల 80వేల ఆస్తులను జప్తు చేసినట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 25వేల కుటుంబాలకు 35వేల ఎకరాల్లో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. త్వరలో ఉపాధి హామీ పథకం ద్వారా పసుపు సాగును ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ చైతన్యం కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 2 కోట్ల మొక్కలు పెంచుతామన్నారు. అరకు అర్గానిక్ కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, డిమాండ్ ఉన్నందున వాటిని రానున్న ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామన్నారు. జిల్లాలోని ప్రతి మండలానికి వంద గోకులాలు మంజూరు అయ్యాయని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి లింకులున్న 4700 మందిని గుర్తించామన్నారు. గంజాయి లింకులుంటే 20 ఏళ్ల జైలు శిక్ష ఖాయమన్నారు. గంజాయి సమాచారం తెలిస్తే 1972 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 35వేల ఎకరాల్లో రూ.54కోట్లతో వాణిజ్య పంటల సాగు చేపడుతున్నామన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ ద్వారా గంజాయిని సమూలంగా నిర్మూలించామన్నారు. గత ఏడాది సుమారు 93 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశామన్నారు. రైతులకు మొక్కలను, రాగి, వరి విత్తనాలను పంపిణీ చేశారు. స్వచ్ఛ సంకల్పం గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్, ఆర్టీసీ చైర్మన్ దొన్నుదొర, ఐటీడీఏ ఇంచార్జీ పీవో, జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఈగల్ ఎస్పీ నగేష్‌బాబు పాల్గొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి వైద్యం
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలని గిరిజన,సీ్త్రశిశు సంక్షేమం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా అభివృద్ధిపై శుక్రవారం అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూగిరిజన ఉత్పత్తులను టీటీడీ కొనుగోలు చేసేలా ఆ సంస్థతో మాట్లాడడం జరిగిందన్నారు. పర్యాటకుల సౌకర్యాలు నిమిత్తం పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ 2029 నాటికి 15శాతం వృద్ధి సాఽధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిచామన్నారు. అనంతరం ప్రభుత్వ దాతలు, ప్రజల భాగస్వామ్యంకు సంబంధించిన పీ–4 గోడపత్రికలను మంత్రితో పాటు అఽధికారులు ఆవిష్కరించారు.
గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మద్దిలపాలెం(విశాఖ): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపక(గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మజ్జి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మద్దిలపాలెంలోని డా.వి.ఎస్. కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాల, అగనంపూడి, ఇస్లాంపేట, పెందుర్తి కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన విశ్రాంత అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్లు, కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించిన ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, బయోడేటా, సంబంధిత ఒరిజినల్, నెటివిటీ ధ్రువపత్రాలను పిఠాపురం కాలనీలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 10.30 గంటల్లోగా సమర్పించాలి. మరిన్ని వివరాలకు 0891–2713791 ఫోన్ నంబర్‌కు సంప్రదించవచ్చని వృత్తి విద్యాశాఖాధికారి తెలిపారు. భౌతికశాస్త్రం–1, జంతుశాస్త్రం–1, వృక్షశాస్త్రం–1, ఫిజియోథెరపీ–1 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి వంగలపూడి అనిత

గంజాయి రహిత మన్యమే లక్ష్యం