
ఉపాధ్యాయుల్లేక సాగని చదువులు
రాజవొమ్మంగి: మండలంలోని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి స్వగ్రామం కిండ్ర పంచాయతీ అనంతగిరిలో విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఇక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిబంధనల ప్రకారం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కేవలం అధికారులు ఒక సీఆర్టీని నియమించి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల గత రెండేళ్లుగా తమ పిల్లల చదువులు సాగడం లేదని గురువారం పాఠశాల ఎదుట వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాల తరచూ మూసి ఉండటం వల్ల తమ పిల్లలు రెండేళ్లుగా ఆట పాటలు, మధ్యాహ్న భోజనానికి పరిమితం అయ్యారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోని పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా పాఠశాలల పరిస్థితి ఏంటని వారు విమర్శించారు. రంపచోడవరం ఎమ్మెల్యేతోపాటు రంపచోడవరం ఐటీడీఏ పీవోకు వినతి పత్రాలు ఇచ్చినా ఏమాత్రం మార్పులేదని వాపోయారు. ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించి తమ పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని వారు విద్యాశాఖ అధికారులను కోరారు.
రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి స్వగ్రామం అనంతగిరిలో
పాఠశాల దుస్థితి
ఆందోళనకు దిగిన విద్యార్థుల
తల్లిదండ్రులు
ఎమ్మెల్యే, పీవోలకు వినతిపత్రాలు
ఇచ్చినా చర్యలు శూన్యమని ఆవేదన