
రోగులకు సకాలంలో వైద్య సేవలు
ముంచంగిపుట్టు: ఎపిడమిక్ సీజన్‌లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించాలని డీఎంహెచ్‌వో టి.విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. గురువారం ఆయన కిలగాడ పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడారు. మందుల గదిని పరిశీలించిన ఆయన వివరాలు తెలుసుకున్నారు. మలేరియా కేసులకు సంబంధించి వివరాలు చెప్పలేకపోవడంతో ల్యాబ్ టెక్నీషియన్ చక్రపాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. గ్రామ సందర్శనలో గుర్తించిన జ్వర బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని వైద్యాధికారి శిరీష, సిబ్బందికి సూచించారు, మలేరియా నిర్థారణ కేసులకు సిబ్బంది పర్యవేక్షణలో రాడికల్ ట్రీట్‌మెంట్ అందించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ముంచంగిపుట్టు సీహెచ్‌సీని తనిఖీ చేశారు. రోగులు, వైద్యుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. సంరక్షణ చర్యలను వైద్యాధికారి శేఖర్‌నుంచి తెలుసుకున్నారు. లబ్బూరు పీహెచ్‌సీ వైద్యాధికారి శ్యాంప్రసాద్ నుంచి రంగబయలు పంచాయతీ లంగాబపోదోర్,వలజంగి గ్రామాల్లో గిరిజనుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న లంగాబపోదోర్ ఆశా కార్యకర్తపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌సీ సూపరిటెండెంట్ కె.గీతాంజలి,జిల్లా డిప్యూటీ డెమో బి.లక్ష్మణ్, జిల్లా ఆరోగ్య పర్యవేక్షకులు ఎం.సంజీవ్‌పాత్రుడు, ఆరోగ్య విస్తరణ అధికారి జి.సింహాద్రి పాల్గొన్నారు. ఇలావుండగా డీఎంహెచ్‌వోకు స్థానిక సీహెచ్‌సీలో సమస్యలను ఆదివాసీ మహిళా సంఘం మండల అధ్యక్షురాలు సొనియా ఈశ్వరి ను వివరించారు.పూర్తి స్థాయిలో వైద్యులు,సిబ్బంది లేకపోవడంతో రోగులు నిత్యం అవస్థలు పడుతున్నారన్నారు. గర్భిణులకు గైనికాలజిస్ట్ లేక అల్ట్రాసౌండ్ పరీక్షలు కొన్ని నెలలుగా జరగడం లేదన్నారు. ఓపీ రోజుకు 200 నుంచి 250 వరకు ఉంటోందని, ఇద్దరు వైద్యులు ఉన్నందున నిరీక్షించాల్సి వస్తోందన్నారు. దీనిపై స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అడుగులపుట్లు ఎంఎల్‌హెచ్‌పీకు చార్జీ మెమో
పెదబయలు: వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. గురువారం ఆయన స్థానిక పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేసి, సూచనలు చేశారు. అడుగులపుట్టు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ డి.మౌనికాలత వైద్యాధికారి అనుమతి లేకుండా ఈ నెల 9 తేదీ నుంచి 17 వరకు విధులకు గైర్హాజరు అవడంపై చార్జి మెమో జారీ చేశారు. వైద్యాధికారి నిఖిల్, డిప్యూటీ డెమో బి.లక్ష్మణ్, ఆరోగ్య విస్తరణాధికారి జి. సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు ఆదేశం
కిలగాడ పీహెచ్‌సీ ల్యాబ్ టెక్నీషియన్‌పై ఆగ్రహం.. షోకాజ్ నోటీసు జారీ

రోగులకు సకాలంలో వైద్య సేవలు