
సుస్థిర వ్యవసాయాభివృద్ధికి మేధోమథనం
స్పెషల్ చీఫ్ సెక్రటరీ
ఎస్‌ఎస్ రావత్
అరకులోయ టౌన్: ఏజెన్సీలో సుస్థిరమైన వ్యవసాయాభివృద్ధితోపాటు అనుబంధ రంగాల్లో ప్రగతి సాధించేందుకు మేధోమథనం చేయాలని రాష్‌ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్ ఆదేశించారు. గురువారం స్థానిక పద్మాపురం ఉద్యానవనంలో వ్యవసాయ, ఉద్యానవనం, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, పశుసంవర్థకశాఖ, డీఆర్‌డీఏ, మార్కెటింగ్ శాఖ, కాఫీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రానున్న మూడేళ్లలో ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. ఏజెన్సీలో దేశంలో ఎక్కడాలేని వనరులున్నందున గిరిజనుల జీవనోపాధి మెరుగుకు కృషి చేయాలన్నారు. పండ్ల తోటలు మరింత విస్తరణకు చర్యలతోపాటు రైతులకు పంట బీమా సౌకర్యం వర్తింపజేయాలని సూచించారు. ఏజెన్సీలో సాగు చేస్తున్న రాగులు, వరి, రాజ్‌మా, ఇతర సిరిధాన్యాల సాగు విస్తీర్ణం, జిల్లా, మండల మహిళా సమాఖ్యల వివరాలు తెలుసుకున్నారు. రైతులకు పంట రుణాలు ఇచ్చి బ్యాంకులు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సమున్నతి ఫౌండేషన్ చైర్మన్ శర్మతో సమావేశమయ్యారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆర్గానిక్ కాఫీ, మిరియం రైతుల ఆదాయం, గిట్టుబాటు ధర, పసుపు, అల్లంతోపాటు పర్యాటక రంగంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సమున్నతి ఫౌండేషన్ చైర్మన్ శర్మ మాట్లాడుతూ గిరిరైతులకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. అరకులోయ, చింతపల్లి మండలం ఎస్‌హెచ్‌జీలకు రుణాలు అందిస్తామని, 11 ఏళ్ల నుంచి ఎఫ్‌పీవోలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు పంటల సాగు, అమ్మకాలు, కొనుగోలులో సహకరిస్తామన్నారు. వ్యవసాయ పెట్టుబడులు తగ్గించడంలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గిరిజన ఉత్పత్తులలో నాణ్యత, తగిన నిబంధనలు పాటించాలన్నారు. దీనివల్ల బ్రాండింగ్ వస్తుందని, మిహిహళా సంఘాలతో కూరగాయల సాగును చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ, పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లావ్యవసాయాధికారి నందు, జిల్లా ఉద్యానవన అధికారి రమేష్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ మురళి, జిల్లా సెరికల్చర్ అధికారి అప్పారావు, ఎల్‌డీఎం నాయుడు, కాఫీ బోర్డు అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సుస్థిర వ్యవసాయాభివృద్ధికి మేధోమథనం