
వానొస్తే గొడుగుడుగుంచం!
బడిలో ఆటల సమయంలో చిన్నారులు గుడుగుడు గుంచం ఆడడం చూస్తుంటాం.. కానీ ఈ చిన్నారులు వానొస్తే నిత్యం ‘గొడుగు’డుగుంచం అంటూ అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తడిచిముద్దయిపోతున్నారు. ఈ చిత్రంలో కనిపించేది ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ ముక్కిపుట్టులో ఎంపీపీ పాఠశాల. ప్రస్తుతం ఈ బడిలో 27 మంది పిల్లలు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో తల్లిదండ్రులు నిర్మించిన ఈ చిన్న రేకుల షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల పైకప్పు కారిపోతోంది. ఫలితంగా పిల్లలు ఇలా గొడుగులు పట్టుకుని కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గోడలు లేకపోవడంతో పక్క నుంచి పడే జల్లు వానకు తడిచి ముద్దవ్వాల్సిందే. గ్రామస్తులు షెడ్డుపైన టార్పాలిన్లు కప్పినా ఫలితం లేదు. నేలంతా బురదమయమవుతోంది. గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోవడంతో విద్యావలంటీర్‌తోనే పాఠశాలను నడిపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చత్వారం సోకిన సర్కారు ఈ ఛత్రాలు చూసైనా చలించకపోతుందా అని నిరీక్షిస్తున్నారు. పక్కా భవనం నిర్మించడంతోపాటు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతున్నారు. – ముంచంగిపుట్టు

వానొస్తే గొడుగుడుగుంచం!