
చాతుర్మాస్య మహావ్రతం ప్రారంభం
● కొత్తపెంటలో సద్గురు దేవానంద స్వామిజీ ఆశ్రమంలో సందడి ● పలు జిల్లాల నుంచి హాజరైన సాధువులు ● దేవానంద స్వామీజి సమాధిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి
దేవరాపల్లి : కొత్తపెంటలోని సద్గురు దేవానంద సరస్వతీ స్వామీజీ ఆశ్రమంలో గురుపౌర్ణమిని పురస్కరించుకొని చాతుర్మాస్య మహావ్రతం పూజలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ చాతుర్మాస్య మహావ్రత ఆధ్యాత్మిక కార్యక్రమం నవంబర్ 5 (కార్తీక పౌర్ణమి) వరకు సుమారు నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తొలిరోజు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవానంద స్వామీజీని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సాధు సత్‌పురుషులు, పీఠాధిపతులు హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. దేవానంద స్వామీజీని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దర్శించుకొన్నారు. సద్గురు దేవానంద స్వామీజీ వారి 25వ పుణ్యతిథి రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వ్రత కాలంలో ప్రతి రోజు పూజా కార్యక్రమాలు, భగవద్గీత పారాయణం, పఠనలు, ప్రవచనాలు, ధ్యానధారణలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు దివ్య జీవన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు.