
అదనపు సీట్లు కేటాయించాలని వినతి
పాడేరు : కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, గిరిజన గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు కేటాయించి దరఖాస్తు చేసుకున్న ప్రతి గిరిజన విద్యార్థికి ప్రవేశం కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పి.అప్పలనర్స డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఐటీడీఏలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. టెన్త్‌లో 60శాతం పైబడి మార్కులు వచ్చిన వారికే గిరిజన గురుకులాలు, కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్‌లో ప్రవేశం కల్పించాలనే నిబంధన వలన చాలా మంది పేద విద్యార్థులు అడ్మిషన్ కోల్పోయారన్నారు. గిరిజన ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం కావడంతో ప్రాథమిక విద్యా దశ నుంచి మెరుగైన విద్య బోధన చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫలితంగా విద్యార్థులకు 60 శాతం పైబడి మార్కులు రావడం లేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి గిరిజన గురుకుల కళాశాల, కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రతి గ్రూపునకు అదనంగా 20 సీట్లు కేటాయించాలని కోరారు. గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. అనంతరం వారు ఐటీడీఏ పీవోకు సమస్యపై వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్షుడు కార్తిక శ్రీను, కార్యదర్శి జీవన్ కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నారావు తదితరులున్నారు.