పెళ్లికి వెళుతూ ఇద్దరు యువకుల దుర్మరణం
పెదబయలు : స్నేహితుడి పెళ్లికి ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ చెట్టును ఢీకొట్టి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటన మండలంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ కె.రమణ, బంధువులు అందించిన వివరాల ప్రకారం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ రోగుల గ్రామానికి చెందిన బొండా మనోజ్‌కుమార్ (21), ఇదే పంచాయతీ రోగులపేట గ్రామానికి చెందిన జర్సింగి కార్తీక్ (28) వరుసకు బావ,బావ మరుదులు. సోమవారం ముంచంగిపుట్టు మండలం ముక్కిపుట్టు గ్రామంలో స్నేహితుడి పెళ్లికి బైక్‌పై వెళుతూ పెదబయలు మండలం అడుగులపుట్టు పంచాయతీ కొత్తాపుట్టు వద్ద రెయ్యలగెడ్డ వంతెన సమీపంలో మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో బొండా మనోజ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, కొనఊపిరితో ఉన్న జర్సింగి కార్తీక్‌ను ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనోజ్‌కుమార్ డిగ్రీ వరకు చదువుకుని గ్రామంలో ఖాళీగా ఉండగా, జర్సింగి కార్తీక్ పెదబయలు మండల పర్రెడ గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మనోజ్‌కుమార్‌కు తల్లి చనిపోయింది, తండ్రి మాత్రమే ఉన్నారు. కార్తీక్ తండ్రి పోలీసు శాఖలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి.
రోగుల, రోగులపేట గ్రామాల్లో విషాదం
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో రెండు గ్రామాలో విషాదం అలుముకుంది. మృతదేహాలను ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రిలో ఉంచారు. మంగళవారం పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మలుపు వద్ద వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను సీతగుంట, పర్రెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పలాసి మాధవరావు, పర్రెడ గ్రామ సచివాలయ సిబ్బంది పరామర్శించారు.
కొత్తాపుట్టు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం
బైక్ చెట్టును ఢీకొని అక్కడికక్కడే
ఒకరు మృతి
మృతులిద్దరూ ఒకే కుటుంబానికి
చెందినవారు
పెళ్లికి వెళుతూ ఇద్దరు యువకుల దుర్మరణం
పెళ్లికి వెళుతూ ఇద్దరు యువకుల దుర్మరణం


