
కిశోర బాలికలు క్రమశిక్షణతో మెలగాలి
గంగవరం : కిశోర బాలికలు క్రమ శిక్షణతో మెలగాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో పీవో కట్టా సింహాచలం అన్నారు. సీడీపీవో సీహెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో కొత్తాడ కేజీబీవీలో కిషోర బాలికలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీవో మాట్లాడుతూ టీనేజ్‌లో గర్భం ధరించడం వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ సందర్భంగా కస్తూర్భా గాంధీబాలికా విద్యాలయంలో ఉన్న సమస్యల గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సీడీపీవో లక్ష్మి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మల్లేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సత్యవతి, ఇన్‌చార్జి హెచ్‌ఎం భారతి, మహిళా సంరక్షణ కార్యదర్శులు వెంకటలక్ష్మి, భద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు నిండిన బాలబాలికలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. గురువారం కొత్తాడ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీడీపీవో సీహెచ్.లక్ష్మి ఆధ్వర్యంలో కొత్తాడ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్న పీవో ప్రీస్కూల్ పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం గర్భిణులు, తల్లులతో మాట్లాడి పోషకాహారం సక్రమంగా అందుతుందో, లేదో అడిగి తెలుసుకున్నారు. బాలసంజీవని, బాలామృతం కిట్లను పరిశీలించారు. సంతృప్తికరంగా సేలందిస్తున్న కొత్తాడ అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త శిరీష పీవో అభినందించారు. సీడీపీవో లక్ష్మి, ఎంఈవో మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూపర్ వైజర్ సత్యవతి, అంగన్‌వాడీ కార్యకర్తలు శిరీష, జ్యోతి, సీతారామలక్ష్మి, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.