బహిరంగ మార్కెట్లో పత్తికి డిమాండ్ క్వింటాల్కు రూ.9వేలకు పైగా చెల్లింపు వర్షాభావంతో భారీగా తగ్గిన దిగుబడి ఎకరాకు 3నుంచి 4క్వింటాళ్లు మాత్రమే తీవ్రంగా నష్టపోతున్న దూది రైతులు
ఆదిలాబాద్టౌన్: అంతర్జాతీయ మార్కెట్లో బేల్ ధర పెరగడం, గింజలకు మంచి ధర పలకడంతో బహిరంగ మార్కెట్లో పత్తికి మద్దతు ధర కంటే అధికంగానే పలుకుతోంది. కానీ, ఎల్నినో ప్రభావంతో దిగుబడులు భారీ తగ్గుతుండడంతో రైతుల ముఖాలు తెల్లబోతున్నాయి. గతేడాది అతి వృష్టి కారణంగా పంటలు దెబ్బతినగా, ఈ ఏడాది అనావృష్టితో దిగుబడులపై ప్రభావం పడింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జమ్మికుంట, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో క్వింటాల్కు రూ.9,200 వర కు చెల్లించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
దిగుబడులు తగ్గి పెరిగిన ధర
రెండు, మూడేళ్లుగా మద్దతు ధరతోనే రైతులు సీసీ ఐకి విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తే మ పేరిట కోతలు విధించడంతో దూది రైతు దుః ఖాల పాలయ్యాడు. ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే తక్కువ ధరకే కొనుగోలు చేశారు. సీసీఐ పెట్టే కొర్రీలతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. దీంతో కొందరు రైతుల కే మద్దతు ధర లభించింది. అయితే, ఈ ఏడాది ప్ర భుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.8,667 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు ఇతర జిల్లాల్లో రూ.9వేల నుంచి రూ.9,200కు పైగా కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మర్కెట్లో బేల్ ధర రూ.66వేలకు పైగానే ఉంది. గింజ ధర రూ.4,500 నుంచి రూ.5వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎల్నినో ప్రభావంతో పత్తి దిగుబడులు రాకపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో ఈ ధర ఎన్ని రోజులుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
మొదటి తీతతోనే..
పత్తి చేన్లు వర్షాలు లేక బీటలు వారాయి. మొక్కలన్నీ వడలిపోయాయి. నెలకు పైగా వర్షాలు లేక పత్తి మొదటి తీతకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. గతేడాది అధిక వర్షాలతో పూత, కాత రాలినా, ఆ తర్వాత కూడా కొంత పరవా లేదన్నట్లు ఉంది. ఈసారి రైతుకు కన్నీళ్లే మిగిలే పరిస్థితులున్నాయి. ఏటా రెండు, మూడు సార్లు పత్తి తీస్తుండగా, ఈసారి మొదటి తీతతోనే చేన్లు తెల్లబోతున్నాయి. డిసెంబర్ నాటికి పత్తి తీత ముగియనుంది. గతేడాది మార్చి వరకు పత్తి కొనుగోళ్లు జరగగా, ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు.
దసరా తర్వాతే కొనుగోళ్లు
జిల్లాలో పత్తి కొనుగోళ్లు దసరా తర్వాతే ప్రా రంభం కానున్నాయి. ప్రైవేట్, సీసీఐ వేర్వేరుగా కొనుగోలు చేస్తామని ప్రకటించినా, ఆ తర్వాత జిల్లా యంత్రాంగం సూచనలతో నిర్ణయాన్ని మార్చారు. ఈనెల 12న ప్రై వేట్ వ్యాపారులు, 21న సీసీఐ కొనుగోళ్లు చేపడతామని ప్రకటించారు. అయితే, ఇరువురు ఒకేరోజు ప్రారంభిస్తే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందని జిల్లా యంత్రాంగం సూచనలతో కొనుగోలు తేదీలో మా ర్పు చేశారు. ఈనెల 22న పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
దిగుబడులు తగ్గి దిగాలు
పత్తిపై ఆశలు పెట్టుకున్న రైతుకు నిరాశే ఎదురైంది. జూన్ చివరి వారం, జూలై మొదటి వారంలో వర్షాలు కురిశాయి. పత్తి విత్తుకోవడం కూడా ఆలస్యమైంది. జిల్లాలో 75శాతానికి పైగా వర్షాధారంపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు. నెలకు పైగా వరుణుడు జాడ లేకుండా పోయాడు. మొదటి విడత వర్షాలతో కాసిన కాతే ఉంది. ప్రస్తుతం పూత లేదు. ఒక్కో మొక్కకు మూడు నుంచి నాలుగు కాయలు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన సగానికి పైగా దిగుబడి తగ్గుతుందని పలువురు రైతులు చెబుతున్నారు. ఎకరాకు 3నుంచి 4క్వింటాళ్లు మాత్రమే వచ్చే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది అధిక వర్షాలున్నా 15.48 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన 12లక్షల క్వింటాళ్లు రావడం గగనమే.


