ఆదిలాబాద్: 70వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) అండర్–14 బాలికలు, బాలుర రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 2026–27 పోటీల్లో జిల్లా క్రీడా పాఠశాల బాలికలు ప్రతిభ చాటారు. నారాయణపేట జిల్లాలో ఈనెల 11న ప్రారంభమైన పోటీల్లో మంగళవారం ఆదిలాబాద్‌కు చెందిన సీహెచ్.మీరా 36కిలోల విభాగంలో, మైథిలి 42కిలోల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. శ్రీలక్ష్మి మనోజ్ఞ 50 కిలోల విభాగంలో, రాంక్షైనీ 46 కిలోల విభాగంలో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మొత్తం నాలుగు పతకాలతో ఆదిలాబాద్ జిల్లా టీజీఎస్ఎస్ జట్టు ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానం సాధించిందని రెజ్లింగ్ కోచ్ శ్రీధర్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంపై డీవైఎస్వో దయానంద్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలురి గోవర్ధన్‌రెడ్డి, డీటీఎస్వో పార్థసారథి తదితరులు అభినందించారు.


