జిల్లా వ్యాప్తంగా ఆదివారం శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల విద్యుద్దీపాలు, పుష్పాలంకరణతో ముస్తాబైన మండపాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నిర్వాహకులు డీజే పాటలపై నృత్యాలు చేస్తూ అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా మండపాలకు తీసుకువచ్చారు. ఆదిపరాశక్తిని ప్రతిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్నిచోట్ల శారదాదేవిని, మరికొన్ని ప్రాంతాల్లో దుర్గామాతను ప్రతిష్ఠించి నవరాత్రి పూజలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని నవశక్తి దుర్గామాత ఆలయంలో తొలిరోజు అమ్మవారిని శైలపుత్రి అవతారంలో అలంకరించి అర్చనలు నిర్వహించారు. భవానీ మాలలు ధరించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలిరాగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. బేల మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారికి మహాహారతి నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లోగల శాకంబరీ మాత ఆలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్, బోథ్ పట్టణంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. రిమ్స్ ఆవరణలోని మహాగణపతి ఆలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష భవానీ మాల స్వీకరించారు. – ఆదిలాబాద్/బోథ్


