ఖానాపూర్ రేంజ్‌లో ఏసీబీకి చిక్కిన మరో అధికారి 2015లోనూ ఎఫ్‌ఎస్‌ఓపై ఆరోపణలు.. తాజాగా లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ఎఫ్‌ఎస్‌వో
ఖానాపూర్: అటవీశాఖకు అవినీతి మరక అంటింది. పదేళ్ల క్రితం ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు రాగా, తాజాగా ఓ అధికారి ఏకంగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఖానాపూర్ అటవీ రేంజ్ కార్యాలయంలో ఎఫ్‌ఎస్‌వో రవీందర్ రూ.12 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. దీంతో 2015 నాటి ఏసీబీ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. అయితే నాటి కేసుకు, తాజా కేసుకు ప్రత్యక్ష సంబంధం లేదని అధికారులు తెలిపారు.
2015లో నంద్యానాయక్‌పై కేసు
2015లో ఖానాపూర్ అటవీ రేంజ్‌లో ఎఫ్‌ఎస్‌వోగా పనిచేసిన నంద్యానాయక్‌పై సామిల్లులు, టింబర్ డిపో నిర్వాహకులు, వడ్రంగులు తదితరులు అవినీతి ఆరోపణలతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అప్పటి అధికారులు పేర్కొన్నారు. అక్రమ కలప రవాణా, ఇళ్ల నిర్మాణాలు, సామిల్లులు, వడ్రంగుల నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి.
నాటి ఫిర్యాదుల్లోనూ రవితేజ
ప్రస్తుతం రవీందర్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేసిన టింబర్ డిపో నిర్వాహకుడు రవితేజ కూడా 2015లో నంద్యానాయక్‌పై చేసిన ఫిర్యాదుదారుల్లో ఒకరు. అప్పట్లో అటవీ అధికారులు రవితేజ ఇంటి నుంచి వడ్రంగి సామగ్రిని తీసుకెళ్లడంతో ఆయన కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపారు. అనంతరం ఏసీబీ కేసు నమోదు కావడంతో బాధితులతో కలిసి కార్యాలయం ఎదుట టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
పదేళ్ల తర్వాత మళ్లీ..
తాజాగా టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి, రూ.12 వేలకు ఒప్పందం కుదిరినట్లు ఏసీబీ తెలిపింది. రవితేజ ఫిర్యాదుతో వల పన్నిన అధికారులు రూ.12 వేలు తీసుకుంటుండగా ఎఫ్‌ఎస్‌ఓ రవీందర్‌ను పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.


