నార్నూర్: ఆదివాసీ ప్రాంతాల యువత భవిష్యత్‌ను మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గాదిగూడ మండలం లోకారిలో ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన లైబ్రరీని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత పుస్తకాలతో స్నేహం చేస్తే వారి జీవితాలు మారుతాయన్నారు. లైబ్రరీలో యూపీఎస్సీ, గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్, డీఎస్సీ, టీజీటీ, ఎస్‌ఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ తదితర ప్రధాన పోటీ పరీక్షలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. త్వరలో పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్‌సాయి, సీఐ అంజమ్మ, ఎస్సై రమ్య, ఆదివాసీ నాయకులు దౌలత్‌రావు, మేస్రం శేఖర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.


