రంగంపేట/సామర్లకోట: వారందరూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలు. బతుకుతెరువు కోసం దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు పనికి వెళ్లారు. దాన్ని పూర్తి చేసి సంతోషంగా స్వగ్రామాలకు బయలుదేరారు. ఇంకో 20 కిలోమీటర్లు అంటే అరగంటలో గమ్యానికి చేసుకుంటారనగా మృత్యువు కబళించింది. వ్యాన్ బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
పనుల కోసం గుంటూరు జిల్లాకు..
కాకినాడ జిల్లా సామర్లకోట, పిఠాపురం మండలం జల్లూరు తదితర గ్రామాలకు చెందిన 11 మంది కూలీలు ఈ నెల 16వ తేదీన గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతంలో సిమెంట్ పలకలతో గోడల ఫెన్సింగ్ పనులకు వెళ్లారు. వాటిని పూర్తి చేసుకుని సోమవారం రాత్రి వ్యాన్‌లో స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. వారి వాహనం రంగంపేట మండలం వడిశలేరు గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఏడీబీ రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, వాహనంలోని సిమెంట్ పలకలు పడడంతో ముగ్గురు మృతి చెందారు. వారిని సామర్లకోటకు చెందిన మసకపల్లి బాలు (21), మురముళ్ల రాజ్ కుమార్ (25), తాతపూడి రాజేష్ (22)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని 108 అంబులెన్స్‌లో పెద్దాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ సుమంత్ తెలిపారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనపర్తి సీఐ సుమంత్ ఆధ్వర్యంలో రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబాల్లో విషాదం
మృతుల్లో మసకపల్లి బాలు (20)కు ఐదేళ్ల క్రితమే చైతన్యతో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పూజ అనే కుమార్తె ఉంది. నాన్న వస్తాడు, మనకు బట్టలు తెస్తాడు అని ఆ పసిపాపకు తల్లి చెబుతున్న సమయంలోనే, తండ్రి ఇక లేడన్న వార్త వచ్చింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ చైతన్య, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇక రాజేష్, రాజ్ కుమార్‌ల మరణాలు ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపాయి.
వరుస మరణాలు
సామర్లకోటలోని కుమ్మరి వీధిని మరణాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన ఘోర బాణసంచా ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన జరిగి నెలలు గడవక ముందే రోడ్డు ప్రమాదంలో ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తరచూ మా వీధినే ఎందుకు ప్రమాదాలు వెంటాడుతున్నాయి అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రమాద స్థలం వద్ద యువకుడి మృతదేహం
క్షతగాత్రులను 108లోకి ఎక్కిస్తున్న సిబ్బంది
ఫ వడిశలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం
ఫ కూలీలతో వెళుతున్న మినీ వ్యాన్
ఫ ముగ్గురి మృతి,
ఎనిమిది మందికి గాయాలు
ఫ గుంటూరు జిల్లాలో
పనికి వెళ్లి వస్తుండగా ఘటన


