దేవీపట్నం: ఇందుకూరు పంచాయతీ పరిధి ఫజుల్లాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఎస్సై షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగవరం మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన చుండం తమ్మన్నదొర (26) ఇందుకూరు గ్రామంలోని తన అక్క ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఫజుల్లాబాద్ అయిలవారి చెరువు గట్టుపై గోకవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయే క్రమంలో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమైన తమ్మన్నదొరను గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
లోక్ అదాలత్‌ను
వినియోగించుకోవాలి
అడ్డతీగల: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఎం.మురళీ గంగాధరరావు అన్నారు. స్థానిక కోర్టు హాలులో మంగళవారం న్యాయవాదులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
ప్రాణం తీసిన స్నానం సరదా
గోదావరిలో మునిగి అన్నదమ్ముల మృతి
ధవళేశ్వరం: సెలవులకు ఇంటికి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారు. సరదాగా స్నానం చేయడానికి వచ్చి మృత్యువాత పడ్డారు. ప్రభువా.. నువ్విచ్చిన పిల్లలను నువ్వే తీసుకుపోయావా అంటూ వారి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే.. ధవళేశ్వరం రాఘవేంద్రస్వామి గుడి సమీపంలో నివసిస్తున్న పెద్దిపాటి శేషుకుమార్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఐటీఐలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్ కుమార్ (21) తాడేపల్లిగూడెంలో హోమియోపతి కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు జశ్వంత్ కుమార్ (18) రామచంద్రపురంలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులకు ధవళేశ్వరం వచ్చిన వీరు మంగళవారం సాయంత్రం స్నానం చేసేందుకు కాటన్ బ్యారేజీ దిగువన ఉన్న ఇసుక తిన్నెలకు వెళ్లారు. వారితో పాటు సావిత్రీ నగర్‌కు చెందిన స్నేహితుడు మహ్మద్ హసన్ రాజాకు వెళ్లాడు. ఇసుక తిన్నెల వద్ద స్నానానికి దిగిన వీరు టెన్నిస్ బాల్‌తో నీటిలో క్యాచ్‌లు ఆడుతుండగా హేమంత్ కుమార్ నీటిలో మునిగిపోతుండడంతో, అతడిని కాపాడబోయిన జశ్వంత్ కుమార్ కూడా గల్లంతయ్యాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితుడు మహ్మద్ హసన్ రాజా నీటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయాన్ని చెప్పాడు. హేమంత్, జశ్వంత్ కోసం నీటిలో మత్స్యకారులతో గాలింపు చేపట్టగా వారి మృతదేహాలు లభించాయి.
విచారణ చేయాలి
చాగల్లు: తన కుమారుడు రవిచంద్ర ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చిట్టూరి ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ భవనం పైనుంచి దూకి 7వ తరగతి విద్యార్థి రవిచంద్ర ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై మృతుడి తండ్రి ప్రవీణ్ మంగళవారం రాత్రి కొవ్వూరు రూరల్ సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగని పక్షంలో ఈ నెల 25న కొవ్వూరు సీఐ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.


