రంపచోడవరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సక్రమంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల వద్ద దోమలు వ్యాప్తి చెందకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిబంధనల ప్రకారం మెనూ అందించాలని, బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలోని జీపీఎస్, ఆశ్రమ, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల వివరాలు తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బి గ్రేడ్‌లో ఉన్న బాలలను ఏ గ్రేడ్‌కు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని, ప్రతి గర్భిణికి రక్తహీనత లేకుండా నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు.
సకాలంలో రేషన్ పంపిణీ చేయాలి
నిబంధనల ప్రకారం తెల్లరేషన్ కార్డు దారులకు రేషన్ పంపిణీ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రఽశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ చాంబర్‌లో పౌరసరఫరా అధికారులు, జీసీసీ డీఎం, జీసీసీ మేనేజర్లు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ కార్డుదారులకు బియ్యం సరఫరాలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. రానున్న వరదలను దృష్టిలో ఉంచుకుని రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకులు జీసీసీ డిపోల్లోని స్టాక్ పాయింట్ల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు.


