ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

అద్దంకి రూరల్‌: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి మండలంలోని కొమ్మాలపాడులో ఉరుసు మహోత్సవానికి వెళ్లి బైకు, స్కూటీలపై తిరిగి వస్తున్న ముగ్గురిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల బంధువులు తెలిపిన వివరాల మేరకు... అద్దంకిలోని ఇందిరానగర్‌కు చెందిన దూదేకుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొటికలపూడి శ్రీను (35) మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో జరుగుతున్న ఉరుసు ఉత్సవానికి స్కూటీపై వెళ్లాడు. అదే ఉత్సవానికి గుంటూరుకు చెందిన దూదేకుల నూర్‌ బాషా సంఘ నాయకులు షేక్‌ సాంబయ్య (52), షేక్‌ షఫీరాజు వచ్చారు. వారంతా ఉత్సవంలో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. ముగ్గురూ కలిసి అద్దంకి వచ్చేందుకు షేక్‌ సాంబయ్య, షేక్‌ షఫీరాజు బైకుపై, కొటికలపూడి శ్రీను స్కూటీపై బయలుదేరారు. నార్కెట్‌పల్లి–మేదరమెట్ల నామ్‌ రహదారిపై వస్తూ.. అద్దంకి సమీపంలోని చక్రాయపాలెం గ్రామ సమీపంలోకి రాగానే వెనుక నుంచి ఓ కారు వేగంగా వచ్చి ముందుగా బైకును, అనంతరం కొంచం ముందున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో బైకుపై ఉన్న షేక్‌ సాంబయ్య, స్కూటీపై ఉన్న కొటికలపూడి శ్రీను అక్కడికక్కడే చనిపోయారు. బైకుపై నుంచి కిందపడిన షేక్‌ షఫీరాజ్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సిబ్బంది చేరుకుని క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కి క్షతగాత్రుడిని తరలించారు. కొటికలపూడి శ్రీను, షేక్‌ సాంబయ్య మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు కొటికలపూడి శ్రీను గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశారు. నూర్‌బాషా సంఘ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని అందరి మన్నన్నలు పొందారు. అలాగే వైఎస్సార్‌ సీపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొని మంచి నాయకుడిగా ఎదుగుతున్నారు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుల్లో మరొకరైన షేక్‌ సాంబయ్య గుంటూరు నివాసి కాగా, క్షతగాత్రుడు షేక్‌ షఫీరాజు కూడా గుంటూరు సమీపంలోని పొన్నవోలు గ్రామంలో ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. అందరితో కలివిడిగా ఉండే కొటికలపూడి శ్రీను మృతిపై వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌, స్థానిక నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

బైకు, స్కూటీలను వెనుక నుంచి ఢీకొట్టిన కారు

ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

ఉరుసు మహోత్సవానికి వెళ్లి వస్తుండగా ఘటన

Advertisement
 
Advertisement
Advertisement