కంపెనీల ఒత్తిడితో.. | - | Sakshi
Sakshi News home page

కంపెనీల ఒత్తిడితో..

Mar 3 2026 8:03 AM | Updated on Mar 3 2026 8:03 AM

ప్రైవేట్‌లో యూరియా నో స్టాక్‌ యాప్‌ అమలు తర్వాత విక్రయాలకు అనాసక్తి వానాకాలంలోనూ ఇదే కొనసాగితే రైతులకు కష్టమే కంపెనీల నిబంధనలతో ప్రైవేట్‌ డీలర్లకు నష్టాలు

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో యూరియా కొరత కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ పట్టణంలో పదుల సంఖ్యలో ప్రైవేట్‌ ఎరువుల డీలర్లు, వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం వారి వద్ద ఎక్కడా యూరియా అందుబాటులో లేదు. జిల్లాలోని పలు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం అన్‌ సీజన్‌ కావడంతో రైతుల నుంచి అంతగా డిమాండ్‌ లేదు. దీంతో సమస్య కనిపించని పరిస్థితి. వానాకాలం సీజన్‌లోనూ ఇలాగే ఉంటే రైతులు ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. జిల్లాలో ఏటా ప్రభుత్వ కేంద్రాలైన సొసైటీలు, డీసీఎంఎస్‌లు, ఆగ్రో సేవా కేంద్రాలతో పాటు ప్రైవేటు షాపుల్లో కలిపి లక్ష మెట్రిక్‌ టన్నులకు పైగా ఎరువుల విక్రయాలు జరుగుతాయి. ఇందులో ప్రభుత్వ కేంద్రాల్లో 60శాతం, ప్రైవేట్‌లో 40శాతం వరకు విక్రయిస్తారు. ఒక్కోసారి ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో లేకపోతే రైతులు ప్రైవేట్‌లో కొనుగోలు చేస్తారు. ఒకవేళ ప్రైవేట్‌లో విక్రయం జరగకపోతే, సీజన్లో వారి కష్టాలు ఇక వర్ణనాతీతమే.

ఫర్టిలైజర్‌ యాప్‌ అమలు తర్వాత

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 20 నుంచి జి ల్లాలో ఫర్టిలైజర్‌ యాప్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ ద్వారా రైతు ముందుగా బుక్‌ చేసుకొ ని ఆ నిర్ధారిత సమయానికి, ఎంపిక చేసుకున్న కేంద్రంలో వాటిని తీసుకునేందుకు అవకాశం కల్పించారు. యాప్‌లో బుక్‌ చేసుకునే క్రమంలో ప్రభుత్వ కేంద్రాలతో పాటు ప్రైవేట్‌ సెంటర్లలో ఎక్కడెక్కడ ఎరువులు అందుబాటులో ఉన్నాయనేది ఆన్‌లైన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. అనుగుణంగా ఉన్న సెంటర్‌ను ఎంపిక చేసుకొని రైతులు నిర్దేశిత సమయానికి ఎరువులు తీసుకున్నారు.

సమస్య ఇలా..

యాప్‌ అమలులోకి వచ్చాక రైతులు ముందుగా బుక్‌ చేసుకొని కావాల్సిన ఎరువులు మాత్రమే తీసుకుంటున్నారు. అంతకు ముందు యూరియా కోసం వచ్చే రైతులకు వాటితో పాటు డీఏపీ, కాంప్లెక్స్‌, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ ఇలా ఇతర ఎరువులను కూడా డీలర్లు, వ్యాపారులు అంటగట్టి వ్యాపార పరంగా ప్రయోజనం పొందేవారు. యాప్‌ రాకతో పరిస్థితి మారింది. డీలర్లు ప్రస్తుతం రైతు బుక్‌ చేసుకున్న ఎరువు మాత్రమే ఇచ్చే పరిస్థితి. ఈ క్రమంలో ప్రైవేట్‌ వ్యాపారులకు యూరియా విక్రయాలపై పెద్దగా మార్జిన్‌ లేకపోవడం, ఇతర ఎరువులను విక్రయించే పరిస్థితి లేకపోవడంతో ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ప్రైవేట్‌లో యూరియా నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. వానాకాలం సీజన్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైతే మాత్రం రైతులకు కష్టాలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం కొరత లేదు..

ప్రైవేట్‌లో యూరియా పరిస్థితిపై ఇప్పుడే అంచనా వేయలేం. ప్రస్తుతం ఎక్కడా కొరత లేదు. వానాకాలం సీజన్‌లో ఆ పరిస్థితి ఎదురవుతుందా అనేది చెప్పలేం. ఫర్టిలైజర్‌ యాప్‌ జిల్లాలో సక్సెస్‌ అయ్యింది. గత డిసెంబర్‌ 20న జిల్లాలో ఈ యాప్‌ అమలు చేయగా, లక్ష 32వేల మంది రైతులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొని ఎరువులు తీసుకున్నారు.

– శ్రీధర్‌ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో సాగు వివరాలు..

వానాకాలం సాగు విస్తీర్ణం(అంచనా):

4లక్షల 40వేల ఎకరాలు

అవసరమయ్యే యూరియా : 35వేల

మెట్రిక్‌ టన్నులు

ప్రైవేట్‌ డీలర్లు వివిధ కంపెనీల నుంచి యూరియాతో పాటు ఇతర ఎరువులను హోల్‌సెల్‌గా తీసుకుంటారు. ఆ డీలర్లతో పాటు రిటేల్‌లో వ్యాపారులు కూడా వాటిని విక్రయిస్తారు. యాప్‌ రాకతో రైతులు కేవలం బుక్‌ చేసుకున్న యూరియా మాత్రమే తీసుకొని ఇతర ఎరువులు కొనుగోలు చేయకపోవడం, ఆ యూరియాపై పెద్దగా ఆదాయం రాకపోవడం, ఇతర ఎరువుల విక్రయాలు లేకపోవడంతో డీలర్లు, వ్యాపారులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలేమో ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామనే షరతుతో ఉండడం, డీలర్లు, వ్యాపారులకు ఇది నష్టంగా మారడంతో వారు వీటి విక్రయాలకు మొగ్గుచూపడం లేదని మార్కెట్లో ప్రచారం సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement