దత్తత కేసులో అరెస్టు
లక్సెట్టిపేట: చిన్నారి అక్రమ దత్తత కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో తిరుపతి, కళావతి దంపతులకు సంతానం లేదు. మంచిర్యాలలోని తీగల్‌పహడ్‌కు చెందిన విజయలక్ష్మి, సూరారం గ్రామానికి చెందిన స్వరూపలు తొమ్మిది నెలల క్రితం ఓ చిన్నారిని అక్రమంగా తీసుకువచ్చి ఆ దంపతులకు ఇచ్చారు. ఈ విషయమై ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. పిల్లలు లేని దంపతుల నుంచి విజయలక్ష్మి, స్వరూప డబ్బులు వసూళ్లు చేసి చిన్నారిని అప్పగించినట్లు విచారణలో వెల్లడైంది. దత్తత నిబంధనలు పాటించకపోవడంతో దంపతులపై కేసు నమోదు చేశారు. చిన్నారిని అక్రమంగా తీసుకువచ్చిన విజయలక్ష్మి స్వరూపను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. ఇద్దరిని పట్టుకోవడం కృషిచేసిన పోలీసులు శ్రీకాంత్, మల్లేశ్, సత్యనారాయణ, మురళి, ప్రవళికను అభినందించారు.


