ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని భట్టుపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రామగోని భవాని(13) మృతి చెందింది. రూరల్ ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం భవాని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి తరలించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి పంపించారు. ప రీక్షించిన వైద్యులు మెదడుకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కాగా, భవాని తండ్రి సారంగం గతంలోనే ఓ ప్రమాదంలో మృతిచెందాడు. ఆమె తల్లి రూప కూలీ పని చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. పెద్దకూతురు భవాని స్థానిక జెడ్పీఎస్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతుండగా, చిన్న కూతురు వైష్ణవి ఐదో తరగతి చదువుతోంది. భవాని మృతితో భట్టుపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతురాలి బాబాయి సంతోష్‌గౌడ్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ గూర్లె భీంరావుపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.


