కలెక్టర్ కుమార్తెకు అక్షరాభ్యాసం
నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ వేకువజామునే కుటుంబ సమేతంగా సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కలెక్టర్‌కు ప్రత్యేక స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానికి ముందు కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.


