ఆగకొండ నీరు వస్తున్నా..
ఫ వృథాగా దుమ్ముకొండ జలాలు
ఫ వాగులపై ప్రాజెక్టులతో వేలాది ఎకరాలు సస్యశ్యామలం
ఫ నాలుగు మండలాలకు ప్రయోజనం
వై.రామవరం: ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తయిన కొండల్లో దుమ్ము కొండ ప్రధానమైంది. పోలవరం జిల్లా వై.రామవరం గ్రామానికి అతి దగ్గరలో సుమారు మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆ కొండపై నుంచి కాలానికి అతీతంగా ఏడాది పొడవునా జలధార వస్తోంది. ఆ ధార ఆ కొండ పైనుంచి చూస్తే లోయలా కనిపించే వై.రామవరం మండలం మీదుగా ప్రవహిస్తోంది. ఈ జలాలు వై.రామవరం మండల ప్రజలకు అందుబాటులో ఉన్నా ఎక్కడా అడ్డుకట్ట లేక నీరు వృథాగా పోతున్నాయి. దుమ్ముకొండల్లో పుట్టి, జీవ నదిలా పారే ఈ నీటిధారకు దుమ్ముకొండ వాగు అనే పేరు ఉంది. ఈ వాగు ఒకపక్క మండల కేంద్రానికి అతి దగ్గరలోని యార్లగడ్డ పంచాయతీ గన్నవరం గ్రామం మీదుగా పారుతుండగా, మరోపక్క కోట గ్రామ సమీపంలో కన్నేరు వాగు నుంచి నీరు వెళ్తుంది. వై.రామవరం మండలంలో ఈ రెండు వాగుల నుంచి మండు వేసవిలో సైతం జలాలు పారుతున్నా, అవి ప్రజలకు ఉపయోగపడడం లేదు. ప్రస్తుతం మండలంలోని భూములకు సాగు నీరు లేక, వర్షాధారంతో ఏడాదికి ఒకే పంట మాత్రమే సాగు చేస్తున్నారు. అదీ కూడా సకాలంలో వరుణుడు కరుణిస్తే, పంటలు పండుతాయి. లేకుంటే కష్టాలు పడాల్సిందే.
● నిధులు మంజూరు చేయాలి
కోట పంచాయతీ సిరిమెట్ల గ్రామం వద్ద కన్నేరు వాగుపై, గన్నవరం వద్ద దుమ్ముకొండ వాగుపై ప్రాజెక్టులు నిర్మిస్తే వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన సుమారు ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అప్పుడు పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలి.
–కడబాల ఆనందరావు, ఎంపీపీ,వై.రామవరం
● ప్రభుత్వం స్పందించాలి
దుమ్ముకొండ, కన్నేరు వాగులపై ప్రాజెక్టులు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌కు విన్నవించాం. దీనిపై అనేక సార్లు సర్వే నిర్వహించారు. అయితే పనులు ముందుకు కదలలేదు. నాలుగు మండలాల ప్రజలకు ఎంతో ఉయోగకరంగా ఉండే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకారం అందిస్తే మంచిది.
–వీరమళ్ల సుబ్బలక్ష్మి, ఎంపీటీసీ, వై.రామవరం
ఆగ‘కొండ’ నీరు వస్తున్నా సాగునీటికి ఆటంకమే.. జీవ నదిలా జలధార పారుతున్నా ఫలితం శూన్యమే.. ఉన్న వనరుల వినియోగంలో అధికారుల చర్యలు నిష్ప్రయోజనమే.. మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దుమ్ము కొండ నీటిని ఒడిసిపడితే సాగుకు సు‘జలమే’.. జిల్లాలోని వై.రామవరంలో దుమ్ముకొండ, కన్నేరు వాగులపై ప్రాజెక్టుల కలకు ఏళ్లకాలంగా గ్రహణం వీడడం లేదు.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.
వాగులపై ప్రాజెక్టులు వస్తే..
దుమ్ముకొండ, కన్నేరు వాగులపై ప్రాజెక్టులు నిర్మిస్తే వై.రామవరం మండలంతో పాటు సరిహద్దులోని అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలకు చెందిన సుమారు 20 వేల ఎకరాలకు ఉపయుక్తంగా ఉంటాయి. దీనివల్ల రెండు పంటలు పండటమే కాకుండా ఎప్పుడూ నీరు అందుబాటులో ఉండి భూములు సస్యశ్యామలం అవుతాయి. నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం ప్రజలకు కలగా మిగిలింది. తీవ్ర నిరాశను మిగుల్చుతుంది. నీటి వనరులను అందుబాటులోకి తేవడంతో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వెంటాడుతోంది. వీటి నిర్మాణంతో ఏ గ్రామాలూ ముంపునకు గురికావు. నీరంతా అటవీ ప్రాంతంలోనే నిల్వ ఉంటుంది. దీంతో ప్రజలకు పెద్దగా పునరావాసం కల్పించే అవసరం కూడా ఉండదు. అలాగే రెండు కొండల నడుమ ప్రవహించే ఈ రెండు వాగులపై నిర్మాణాలు చాలా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే అవకాశాలున్నాయి. అంతే కాకుండా జల విద్యుత్ కేంద్రాలకూ అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ నీటి నిల్వలు ఒకపక్క పంటలకు, మరోపక్క విద్యుత్ ఉత్పత్తికి ఊతంగా మారతాయి. భూములు సస్యశ్యామలం కావడంతో పాటు ఏజెన్సీ ప్రాంతానికి విద్యుత్ కొరత తీరుతుంది. ప్రభుత్వం స్పందించి వై.రామవరం మండలంలోని గన్నవరం గ్రామం వద్ద దుమ్ముకొండ వాగుపై, కోట పంచాయతీ సిరిమెట్ల గ్రామం వద్ద కన్నేరు వాగుపై ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆగకొండ నీరు వస్తున్నా..


