
‘మధ్యాహ్నం’ ఎప్పుడో!
● అవస్థల్లో ఇంటర్ విద్యార్థులు ● అల్పాహారం చేసి కాలేజీలకు.. ● ఖాళీ కడుపుతో తిరిగి ఇళ్లకు.. ● అర్ధాకలితో అలమటిస్తున్న వైనం
చెన్నూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం మఽధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంలేదు. దీంతో గ్రామీణ విద్యార్థులు అర్ధాకలితో చదువులు కొనసాగిస్తున్నారు. జిల్లాలో వేలాదిమంది గ్రామీణ విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తూ నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం అల్పాహారం తీసుకుని ఇంటి నుంచి క ళాశాలలకు వస్తున్న విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లే సరికి సాయంత్రం 6గంటలవుతోంది. అప్పటివరకు భోజనం లేక నీరసించి పోతున్నారు. ప్రతీ కళాశాలలో 100–200 మందికి పైగా విద్యార్థులుండగా హాజరు శాతం అంతంత మాత్రంగా ఉంటోందని అధ్యాపకులు చెబుతున్నారు. ఇందులో గ్రామీణ విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు.
గతంలో దాతల సాయంతో..
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో 2015 నుంచి 2017 వరకు అప్పటి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, 2019లో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి గ్రామీణ ఇంటర్ విద్యార్థుల ఆకలి తీర్చారు. కరోనా వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం నిలిచిపోయింది. గత ఎమ్మెల్యేల మాదిరిగా దాతలు ముందుకువచ్చి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
జిల్లాల వారీగా ప్రభుత్వ కళాశాలలు, విద్యార్థుల వివరాలు
జిల్లా కళాశాలలు ప్రథమ ద్వితీయ మొత్తం
మంచిర్యాల 10 2,160 1,850 4,010
ఆదిలాబాద్ 13 3,100 3,506 6,606
నిర్మల్ 15 2,517 2,469 4,977
కు.ఆసిఫాబాద్ 11 1,645 2,535 4,180