breaking news
yedukondalu
-
ఏడు కొండలు... ఎన్నో విశేషాలు
‘ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా గోవిందా!’ అని నోరారా అంటే అదొక ఆనందం. చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. ఇక స్వామి వారి చరిత్ర పరమాద్భుతం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. ఆ కొండల మధ్య వింతగా వెలుగులీనుతున్న బంగారు మేడ ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయాన్ని చూస్తే భక్తులకు ఎక్కడలేని పరమానందం. ఆ మేడలోని అతిలోక సుందర మోహనాకారుడు శ్రీవేంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఉవ్విళ్లూరతారు. అతిలోక సుందరుడు శ్రీనివాసుడు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగంశ్రీభూమికాంతమరవింద దళాయతాక్షమ్ఆనందనిలయుడు, అందరినీ సమ్మోహనపరచే ఆతిలోక సుందరుడు... ఇంతటి సుకుమారమైన దేవుడు ‘నేను వైకుంఠాన్నయినా విడిచి ఉంటాను గాని, నా భక్తులను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను’ అంటూ శ్రీవైకుంఠం నుంచి దిగివచ్చి భూలోకంలోని వేంకటాచలంలో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా వక్షస్థల శ్రీమహాలక్ష్మితో స్వయం వ్యక్తరూపంలో ఆవిర్భవించారు. వక్ష స్థల లక్ష్మి వల్లే ఆ స్వామి ‘శ్రీ’నివాసుడయ్యాడు. విచిత్ర భంగిమలో తిరుమలేశుడు శిరస్సున కిరీటం, యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ రెండు చేతుల్లో శంఖచక్రాలను ధరించి, కింద కుడిచేతిని వరదముద్రలో ఉంచి తన పాద ద్వయాన్ని శరణు వేడుమన్నట్లుగా చూపిస్తుంటాడు. కింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటి హస్తంతో మోకాళ్లను చూపుతున్నాడు. విచిత్రమైన ఈ భంగిమలో తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం, తన పాదాలను శరణు వేడితే చాలు. ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటి హస్తంతో, కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో సొంపైన భంగిమలో నిలిచి ఉన్న సుందరమూర్తి శ్రీనివాసుడు. పంచబేరాలు ఆనందనిలయ గర్భాలయంలో సాలగ్రామ శిలామూర్తి అయిన మూలవిరాట్టుతో పాటు శ్రీనివాసునికి మరో నాలుగు రకాల ఉత్సవమూర్తులు ఉన్నాయి. వీటిని మూలమూర్తితో కలిపి పంచబేరాలు అంటారు. మూలవిరాట్టు స్థిరంగా 8 అడుగుల ఎత్తు సాలగ్రామ శిలామూర్తిని ‘ధ్రువబేరం’ అంటారు. ఈ స్వామివారి దర్శనం కోసమే భక్తులు యాత్రకు వస్తుంటారు. ఈ మూలవిరాట్టుకే ప్రతిరోజు ప్రధానంగా సుప్రభాతం, రెండు పర్యాయాలు తోమాలసేవ అనే పుష్పాలంకరణ సేవ, ఉదయం సహస్ర నామార్చన, మధ్యాహ్నం సాయంత్రం అష్టోత్తర శతనామార్చనలు, మూడు పూటలా నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, గురువారం తిరుప్పావడ సేవ, నేత్ర దర్శనం, రాత్రి పూలంగి సేవ, శుక్రవారం ఉదయం సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. శ్రీస్వామివారికి అర్చనలు, నివేదనలు జరిగిన వెంటనే వక్షస్థలంలోని ‘వ్యూహలక్ష్మి’కి జరుపుతారు. రెండవబేరం ‘శ్రీభోగ శ్రీనివాసమూర్తి’. మూలమూర్తికి నకలు వెండి ప్రతిమ అయిన ఈయననే ‘మనవాళ పెరుమాళ్’ అంటారు. ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ వెండి మూర్తికి ప్రతిరోజు ఉదయం ఆకాశగంగా తీర్థాభిషేకం రాత్రి పవళింపు సేవ, ఏకాంతసేవ జరుగుతుంది. ఈ స్వామివారికి ప్రతి బుధవారం బంగారు వాకిలి వద్ద సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మూడవ బేరం ‘కొలువు శ్రీనివాసమూర్తి’. మూలమూర్తికి నకలు పంచలోహ ప్రతిమ. ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే ఈ మూర్తి బంగారువాకిలి లోపల ‘బంగారు సింహాసనం’లో కొలువుదీరగా, ప్రతిరోజూదర్బారు జరుగుతుంది. పంచాంగ శ్రవణం తరువాత ఆదాయ వ్యయాల లెక్కలన్నీ వినే స్వామి ఈ కొలువుమూర్తి. నాల్గవ బేరం ‘ఉగ్ర శ్రీనివాసమూర్తి’. శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న ఈ ఉగ్రమూర్తికి పూర్వం ఉత్సవాలు జరిగేవి. ప్రస్తుతం జరగడం లేదు. కార్తీక కైశిక ద్వాదశి రోజున మాత్రమే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే ఉత్సవం పూర్తి చేసుకుని ఆలయంలోకి వెళ్తారు. ఐదవ బేరం ‘ఉత్సవ శ్రీనివాసమూర్తి’. వీరే మలయప్పస్వామి. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న ఉత్సవమూర్తి. మలయప్పకోనలో దొరికాడట. అందుకే మలయప్పస్వామిగా పిలువబడుతూ, ఆలయం బయట అన్ని ఉత్సవాల్లో పాల్గొంటూ, భక్తులకు సన్నిహితంగా దర్శనమిస్తుంటాడు.వీరు కాకుండా ఆనందనిలయ గర్భాలయంలో ‘సుదర్శన చక్రత్తాళ్వార్, అనంతుడు, శ్రీసీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు, సుగ్రీవహనుమంతులు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు’తదితర ఉత్సవమూర్తులు ఆయా వేళల్లో ఊరేగింపుల్లో పాల్గొంటుంటారు. వీరిలో కొన్నింటిని ప్రస్తుతం తీర్థం ఇచ్చే అరలో చూడవచ్చు. తిరుమలేశునికి ఎన్నెన్నో వింత పేర్లు తిరుమలేశుడికి అనేక నామాలు ఉన్నాయి. అవన్నీ విచిత్రమైన పేర్లు. అవన్నీ ఆ స్వామివారి సొంత పేర్లా అంటే అదీ చెప్పలేం అంటున్నారు శ్రీజూలకంటి బాలసుబ్రహ్మణ్యం. కాని అన్ని పేర్లు భక్తులు ప్రియంగా... ఇష్టంగా పిలుచుకుంటున్నవే. వాటిలో ప్రసిద్దమైనది ‘ఏడుకొండలవాడా’. శేషాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి అనే ఏడుకొండల్లో ఉన్న స్వామి కనుక ఏడుకొండలవాడయ్యాడు. అదేవిధంగా వేం – పాపాలను, కట – పోగొడుతాడు కనుకే ‘వేంకటపతి’ అనీ, తిరుమలేశుడని, స్థలాన్ని బట్టి, చేసే పనినిబట్టి పిలువబడుతున్న స్వామే శ్రీనివాసుడు. అన్ని పేర్ల కంటే మరో విచిత్రమైన పేరు ఉంది. భార్య పేరుతో పిలుచుకోవడం. అదే ‘శ్రీ’నివాసుడు. ఆయన వక్షస్థలంలో ఉన్న ‘వ్యూహలక్ష్మి’ భక్తుల కోరికలను తీర్చడంలో, స్వామికి చెప్పి సిఫారసు చేస్తుంటారట. ఆమె ‘వాత్సల్య గుణోజ్జ్వలాం’ కనుక భక్తుల మీద ప్రేమ ఎక్కువ. ఆ తల్లి వల్లే ‘శ్రీ’నివాసుడు’ అని పిలువబడుతున్నాడు. అసలు నీ పేరేమయ్యా? అంటే చెప్పరు కానీ ‘అడుగడుగు దండాలవాడా’ అని పిలిచినా పలుకుతాడు. ‘ఆపద్బాంధవా’ అని పిలిచినా పలుకుతాడు. ఇలా ఏ పేరుతో పిలిచినా పలుకుతూ మన కోరికలు తీరుస్తూనే ఉన్న వింత వింత పెట్టుడు పేర్ల దేవుడే వేంకటేశుడు. ఉత్సవాల దేవుడు శ్రీనివాసుడు తిరుమలేశునికి ఉత్సవాల దేవుడు అనే పేరుంది. ఈ స్వామికి సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలు, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలతో పాటు విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం మొదలైన వారోత్సవాలు, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, శ్రవణం, పున్నమి గరుడసేవ వంటి మాసోత్సవాలు, ఉగాది ఆస్థానం, ఆణివర ఆస్థానం, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం వంటి వార్షికోత్సవాల్లో శ్రీవేంకటేశుడి వైభవం వర్ణనాతీతం. కమ్మని ఆరగింపులంటే ఇష్టం ఆనందనిలయుడు అలంకారప్రియుడు. అంతకంటే భోజనప్రియుడు. వాటన్నిటికంటే భక్తప్రియుడు. భక్తుల కోసమే ఎన్నెన్నో కమ్మగా ఉండే లడ్డూలు, వడలు, దోసెలు, అప్పాలు, క్షీరాన్నం, పాయసం, కదంబం, పులిహోర, పొంగలి, సీరా, కేసరి తదితర అన్నప్రసాదాలను సుష్టుగా ఆరగిస్తాడు. భోజన ప్రియుడైన శ్రీనివాసుడు నిత్యం ‘తోమని పళ్లాల్లో’ ఆరగిస్తారట. ఒకసారి భోజనం చేసిన పళ్లాన్ని శుభ్రం చేయకుండా పడవేస్తారు. భోజనానికి మళ్లీ కొత్త పళ్లెం ఉపయోగిస్తారు. ఇంకా విచిత్రమేమంటే.. మట్టికుండ అది కూడా సగం పగిలిన మట్టికుండ, అదే ఓటి కుండ లేదా ఓడు అంటారు. ప్రతి రోజు ‘ఓడు’లో మాత్రమే ఆరగించే ఆనందనిలయుని వైభోగం ఇదా అని ఆశ్చర్యపోక తప్పదు. ఇలా ఏది తిన్నా తన భుక్తశేషాన్ని మళ్లీ భక్తులకే ప్రసాదిస్తాడు. వాటిని తిన్న భక్తులకు తుష్టీ, పుష్టీ, సంతుష్టితో పాటు సంపూర్ణ ఆరోగ్యం, సమస్త కోరికలు తీరుతున్నాయి. స్వామి వారికి ముత్యాల హారతి చివరిది ప్రతిరోజు రాత్రి చివరగా తిరుమలేశునికి ‘ఏకాంతసేవ’ అనే పవళింపుసేవ జరుగుతుంది. ఈ సేవలో సన్నిధిగొల్ల పట్టుపాన్పును వేసి దీపజ్యోతులు వెలిగిస్తారు. శ్రీవారు యోగనిద్రకు ఉపక్రమిస్తూ తూగుటుయ్యాలలో మెల్లగా ఊగుతుంటాడు. ఆ సమయంలో అన్నమయ్య జోలపాట పాడుతుండగా తరిగొండ వెంగమాంబ పేరుతో ముత్యాలు పేర్చిన వెండిపళ్లెంలో కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పిస్తారు. తరిగొండ నుంచి చిన్నప్పుడే వచ్చి తిరుమల సన్నిధిలో స్థిరపడిన పరమభక్తురాలు వెంగమాంబ. ఈమె సమర్పించే ముత్యాలహారతే చివరి హారతి. అందుకే శ్రీవారి ఆలయంలో ‘తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది. ఆ తరువాత దర్శనాలు, హారతులు ఉండవు. ఆ తరువాత శ్రీవారి ఆలయం బంగారువాకిళ్లు మూసివేస్తారు. భక్తులు ఆచరించవలసిన సంప్రదాయాలు తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి. పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి. శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి. శ్రీభూవరాహస్వామి వేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి. ఈయననే ‘శ్వేత వరాహస్వామి’ అంటారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలిపూజ, తొలి నైవేద్యం, తొలి దర్శనం జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తరువాత శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించడం శ్రేçష్ఠం. అలా చేస్తేనే శ్రీవారికి ఇష్టమని, యాత్ర సఫలం అవుతుందని చెబుతారు. తిరుమల క్షేత్రపాలకుడు శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు సాక్షాత్తు పరమశివుడు. ఆయనే ఈ క్షేత్రంలో ‘రుద్రుడు’గా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు, గోగర్భంలో ఉంటూ మహాశివరాత్రికి అభిషేకాలు జరుపుకుంటున్నాడు. బ్రహ్మపూజ.. బ్రహ్మతీర్థం భక్త వరదుడైన తిరుమలేశునికి బంగారు వాకిళ్లు తెరవక ముందే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో (2.30 – 3 గంటలు) బ్రహ్మదేవుడు తొలిపూజ చేస్తాడు. అందుకోసమే ఆలయంలో బ్రహ్మపూజ కోసం ‘పెద్ద బంగారు గిన్నె’లో జలాన్ని, పళ్లెంలో చందనాన్ని ఉంచుతారు. ఆ తరువాత దాన్నే ‘బ్రహ్మతీర్థం’గా భక్తులకు ఇస్తారు. ప్రత్యేకంగా కన్యామాసంలో బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాడు. తొలి హారతి శ్రీవారి సుప్రభాతానంతరం స్వామివారికి మహంతు బావాజీవారి ‘నవనీత హారతి’ తొలిగా సమర్పిస్తారు. శ్రీస్వామివారితో పాచికలాడిన పరమభక్తుడే ఈ మహంతు బావాజీ. మేల్కొలుపు సేవ ప్రతిరోజు శ్రీవారి సుప్రభాతంలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు బంగారు వాకిళ్ల దగ్గర నేటికీ మేల్కొలుపు పాటలు పాడుతూ స్వామివారిని మేల్కొలుపుతారు. అలాగే రాత్రి ఏకాంత సేవలో ‘జోలపాట’ పాడుతూ స్వామివారి పవళింపు సేవలో పాల్గొంటున్నారు. నిత్యం జరిగే ‘కళ్యాణోత్సవం’లో తాళ్లపాక వారు నిత్య కన్యాదాతలుగా సత్కారం పొందుతున్నారు. పుష్ప కైంకర్యం శ్రీనివాసుడు పుష్పప్రియుడు. కొండ మీది పూలన్నీ స్వామివారి పూజకు మాత్రమే. ఇతరులు పుష్పాలు ఉపయోగించరాదు. అందుకే తిరుమలకు ‘పుష్కర మండపం’ అని పేరు. వెయ్యేళ్లకు పూర్వం నుంచి ఆనందాళ్వారు శ్రీనివాసుని పుష్ప కైంకర్యంలో పాల్గొంటున్నారు. వీరు భగవద్రామానుజాచార్యులవారి శిష్యులు. తీర్థ కైంకర్యం ప్రతిరోజు శ్రీవారి భోగశ్రీనివాసమూర్తికి, ప్రతి శుక్రవారం మూలమూర్తికి ఆకాశగంగ తీర్థంతో అభిషేకం జరుగుతుంది. తిరుమలలోని ఆకాశగంగ తీర్థ జలాలను తెచ్చే కైంకర్యంలో సుమారు వెయ్యేళ్లుగా తిరుమలనంబి అనే వైష్ణవాచార్యుల వంశీయులు పాల్గొంటున్నారు. వీరు శ్రీరామానుజుల వారికి గురువులు. స్వయానా మేనమామ కూడా. శ్రీనివాసుడు వీరిని ఒక సందర్భంలో తాతా.. తాతా అన్నాడట. అందువల్లే తిరుమలనంబికి ‘తిరుమల తాతాచార్యులు’ అనే పేరు వచ్చింది. అబ్బురపరచే ఆభరణాలు ఘనవేంకటేశునికి పాదాది శిరస్సు వరకు ఎన్నో దివ్యాభరణాలు, మణిహారాలతో అలంకృతుడై భక్తులను అబ్బురపరుస్తుంటాడు. బంగారు పద్మపీఠం, బంగారు పాద కవచం, స్వర్ణ పీతాంబరం, బంగారు నందకఖడ్గం, వజ్రాలు తాపడం చేసిన సూర్యకఠారి, వైకుంఠ హస్తం (వరదహస్తం), కటిహస్తం, బంగారు కవచాలు, సాలగ్రామ హారాలు శంఖుచక్రాల బంగారు కవచాలు, నవరత్నాలు తాపడం చేసినవి, లక్ష్మీహారం, నాలుగు పేటల సహస్రనామ మాలలు, వజ్ర కిరీటాలు, మకర తోరణంతో పాటు శ్రీవారికి ఆపాదమస్తకం ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలను ఆయా విశేష సందర్భాల్లో స్వామికి అలంకరిస్తారు. ఇవన్నీ ఎక్కడివి? ఎవరిచ్చారు? అంటే కోరికలు తీరిన భక్తులు ఇచ్చి ఉంటారు. స్వామి వారు ఎంతమందికి మాట ఇచ్చారో, మాట నిలబెట్టారో, ఎందరికి కడుపును పండించారో, ఎందరికి కడుపు నింపారో, ఎందరికి చేతులు, కాళ్లు, కన్నులిచ్చారో... ఎవరికి తెలుసు. అలా కోరికలు తీరిన భక్తులే స్వామివారికి మణులిచ్చారు. అలంకారాలిచ్చారు. ఆ భక్తులు ఇచ్చిన వాటినే శ్రీనివాసుడు మురిపెంగా అలంకరించుకుంటూ భక్తులను మురిపిస్తున్నారు. -
అవినీతి కొండ
సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నుల శాఖలో భారీ తిమింగలం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు చిక్కింది. ఈడ్పుగల్లులోని ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ (స్టేట్ ట్యాక్స్) ఏడుకొండలును ఆయన కార్యాలయంలోనే ఐటీడీ సిమెంటేషన్స్ ప్రతినిధుల వద్ద లంచం తీసుకుంటుండగా శుక్రవారం అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.27 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కటంతో వాణిజ్యపన్నుల శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఉన్నతస్థాయి అధికారి చిక్కడం ఇదే ప్రథమమని చర్చించుకుంటున్నారు. గతంలో డెప్యూటీ కమిషనర్గా.. 2004–05లో విజయవాడ ఒకటో డివిజన్ డెప్యూటీ కమిషనర్గా ఏడుకొండలు పనిచేశారు. అంతకుముందు ఇక్కడే అసిస్టెంట్ కమిషనర్ (ఇంటెలిజెన్స్)లో పనిచేశారు. అప్పట్లోనే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. నిజామాబాద్లో డెప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ జరిగిన భారీ కుంభకోణంలో ఏడుకొండలు హస్తం ఉందని ప్రచారం జరిగింది. అప్పుడే ఆయన కారు బహుమతిగా పొందినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. జాయింట్ కమిషనర్గా వెళ్లినా ఆయన పద్ధతులు మార్చకోలేదు. వాణిజ్యపన్నుల ఖలో పనిచేసే ఇతర అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే ఏసీబీ అధికారులు దాడులు చేసి ఏడుకొండలును అరెస్ట్ చేశారు. రిఫండ్స్ ఇవ్వాలంటే లంచాలు ముట్టజెప్పాల్సిందే.. కమిషనర్ కార్యాలయంలో రిఫండ్ ఫైల్ వచ్చిందంటే అధికారులకు పండగేనన్న ఆరోపణలు ఉన్నాయి. డీలర్లకు కోట్లలో రిఫండ్ ఇవ్వాల్సి రావడంతో లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని ముఖ్య అధికారులందరికీ ఇందులో వాటాలు ఉంటాయి. ఐటీడీ సిమెంటేషన్స్ రూ.4.6 కోట్ల వరకూ చెల్లించాల్సి రావడంతో ఏడుకొండలు రూ.23.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఈ సొమ్ము ఇవ్వడానికి ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధపడ్డారు. అయితే, ఆ శాఖలోని అధికారుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఏసీబీకి సమాచారం అందినట్లు తెలిసింది. కాగా, రూ.10 లక్షలలోపు రిఫండ్స్ డెప్యూటీ కమిషనర్, ఆపైన కమిషనర్ కార్యాలయానికి వెళ్తాయి. అయితే, పెద్ద మొత్తాల కేసులు కూడా సీటీవో స్థాయిలో పరిశీలించాకే ఉన్నతాధికారులకు పంపుతారు. దీంతో అందరినీ చేతులు తడపాలంటే కష్టంగానే ఉందని డీలర్లు వాపోతున్నారు. అంతాఅవినీతి వాణిజ్య సంస్థలపై సీటీవో స్థాయి అధికారులు దాడులు చేసి జరిమానాలు వేసినప్పుడు డీలర్లు సంతృప్తి చెందకపోతే డెప్యూటీ కమిషనర్ అపెలెంట్స్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. అక్కడ అపెలెంట్ డెప్యూటీ కమిషనర్ జరిమానా వేసిన కేసులను కూడా కమిషనర్ కార్యాలయం అధికారులు తిరగదోడి చిన్నచిన్న తప్పుల్ని చూపించి భారీగా లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ శాఖలో ఉన్నతాధికారుల అవినీతి గురించి కథలుకథలుగా చెబుతున్నారు. వాణిజ్యపన్నుల శాఖలోని ఒక ముఖ్య అధికారి విజయవాడలో సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఇంటిని బినామీతో రూ.90లక్షలకు కొనిపించారు. ఆ ఇంట్లో తానే అద్దెకు ఉంటూ ఆ ఇంటిని కొనేందుకు ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకుని, రూ.కోటి బ్యాంకు రుణం తీసుకున్నారు. దీనికి మరో కోటి వెచ్చించి మరమ్మతులు చేయించారు. అధికారులే అవినీతిపరులు కావడంతో కిందిస్థాయి అధికారులు చేసే అవినీతిని పట్టించుకోలేకపోతున్నారని వాణిజ్యపన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
భార్య మృతితో మనస్తాపం చెంది...
తిరువూరు : కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఐదు రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె భర్త, కుమార్తె తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో వీరిద్దరు కూడా ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆ క్రమంలో భర్త మృతి చెందగా.. కుమార్తె మాత్రం విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకర్లకు చెందిన ఏడుకొండలు (30) భార్య ఐదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. చేతబడి చేస్తామని కోయవాళ్ల నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో ఆమె జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. భార్య మరణంతో ఏడుకొండలతోపాటు కుమార్తె రమ్య తీవ్ర మనస్థాపం చెందారు. దాంతో బుధవారం రమ్య, ఎడుకొండలు పురుగుల మందు తాగారు. ఆ విషయాన్ని గమనించిన బంధువులు వెంటనే ఏడుకొండలను ఆసుపత్రికి తరలించారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుమార్తె రమ్య మాత్రం విజయవాడ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. ఏడుకొండలు దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటనతో కాకర్లలో విషాదఛాయలు అలముకున్నాయి.