breaking news
Workplace harassment
-
బాసే రైటు
మీ బాస్‌ను ఎలా మేనేజ్ చేయాలో మీకు ఎవరూ నేర్పించరు. వారిని మేనేజ్ చేయడానికి, ముందుగా వారు ఎలాంటి వ్యక్తో మీరు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇందుకు మీకు ఎం.బి.టి.ఐ. (మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్) సహాయపడవచ్చు. బాస్‌లు ఎలా పని చేస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, అనే అంశాలపై ఆధారపడి ఈ ఇండికేటర్ బాస్‌లను కమాండర్, విజనరీ, హార్మనైజర్, స్ట్రాటిజిస్ట్, ఎనలిస్ట్, సపోర్టర్, మ్యావరిక్, ఫ్రీ స్పిరిట్ అనే 8 రకాల వ్యక్తులుగా విభజించింది. ఈ ఎనిమిది మందిలో మీ బాస్ ఏ టైపు మనిషో కింద ఇచ్చిన ఇండికేటర్ ‘కీ’ చెబుతుంది. కనుక ఇండికేటర్‌ను ఫాలో అయిపోండి. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అంటారు కనుక బాస్ తత్త్వానికి అనుగుణంగా మీరు మారండి. ప్రశాంతంగా ఉండండి. కెరీర్లో విజయం సాధించండి.కమాండర్లు వీళ్లు ఫలితాలనే నమ్ముతారు. పనిలో వేగాన్ని, స్పష్టతను కోరుకుంటారు. సామర్థ్యం, నాయకత్వం, తర్కం వీళ్లలో ముఖ్యమైనవి. వీళ్లకు సమావేశాలు, డెడ్లైన్లు ముఖ్యం. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాత్మకంగా వ్యవహరించే ఉద్యోగులను వీరు అభిమానిస్తారు. ఇలాంటి వారితో పేరాల్లో కాకుండా బుల్లెట్ పాయింట్లలో మాట్లాడాలి. కుంటి సాకులు, భావోద్వేగాలు వీళ్లు నచ్చవు. గడుపులోపే చెప్పిన పని అయిపోవాలి. ఇలాంటి వాళ్ల దగ్గర అస్తవ్యస్తంగా, అనిశ్చితంగా ఉంటే మీ కెరీర్ దెబ్బతిన్నట్లే. విజనరీలు వీరు శక్తిమంతులు. ఐడియాల పుట్టలు. వినూత్న ఆవిష్కరణల్ని ఇష్ట పడతారు. వీరు వర్క్‌ప్లేస్‌ని శక్తిమంతంగా మార్చేస్తారు. భవిష్యత్తుపై దృష్టి ఉంటుంది. పని ఎలా జరుగుతోందో చూడరు. ఎంత జరిగిందో అడుగుతారు. వీరిని ఆకట్టుకోవడానికి ఫ్రెష్ ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనల్ని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగి ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, ఆఫీస్ నుండి వెళ్లేటప్పుడు ఆ ప్రయాణంలో సైతం ఆఫీస్ పని చేయవలసి వస్తుంది. రూల్స్ మాట్లాడకూడదు. స్ప్రెడ్షీట్లను కుమ్మరించకూడదు. అంతులేని ఫాలో–అప్‌లతో వారిని ముంచెత్తకూడదు. ఉద్యోగికి సమయస్ఫూర్తి లేకపోవడం వారిని నిరాశపరుస్తుంది.హార్మౖనైజర్లుఉద్యోగులతో వీరు స్నేహపూర్వకంగా ఉంటారు. అందర్నీ కలుపుకుని పోతారు. సామరస్యాన్ని కోరుకుంటారు. టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు. మీ పుట్టినరోజును గుర్తుంచుకుంటారు. లేదా మీ కుటుంబం బాగోగుల గురించి అడుగుతారు. హెల్ప్ చేసేందుకు రెడీగా ఉంటారు. వీరి నాయకత్వం పరస్పర విశ్వాసం, భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. వీరితో పనిచేయడానికి కమ్యూనికేటివ్‌గా ఉండాలి. టీమ్ కల్చర్ నిర్మాణానికి మీ సహకారాన్ని కోరుకుంటారు. ఘర్షణాత్మక ధోరణిని అస్సలు ఇష్టపడరు. టీమ్ ఒకలా ఆలోచిస్తే మీరు టీమ్‌కు విరుద్ధంగా ఆలోచించటం వీరిలో అసహనం కలిగిస్తుంది. స్ట్రాటెజిస్టులుఆలోచనాత్మకమైనవారు. లక్ష్యాలే ముఖ్యమైన దార్శనికులు. లోతుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా ప్రణాళిక వేస్తారు. స్వేచ్ఛ, వ్యూహాత్మకత విలువైనవిగా భావిస్తారు. నాటకీయతను ఇష్టపడరు. అన్నీ తెలుకుని ఉంటారు. పైకి వ్యక్తపరచరు. నాణ్యమైన పనిని ఆశిస్తారు. వీరి దగ్గర భావోద్వేగ ప్రకోపాలు, నిస్సారపు ఆలోచనలు, అస్తవ్యస్తమైన ఆలోచనలు ఉద్యోగికి నష్టాన్ని తెస్తాయి. నిర్మాణాత్మక వాదనలు మాత్రమే వీరి దగ్గర చేయాలి.ఎనలిస్టులు కచ్చితమైనవారు, తార్కికంగా ఉంటారు. ప్రతిదీ వివరంగా తెలుసుకుంటారు. స్పష్టత ముఖ్యం. ఆధారాలు అవసరం. మీరు వాగ్దానం చేసిన వాటిని అమలు చేయాలని వీరు ఆశిస్తారు. అరకొర పనులను, నిర్ణయాలలో ఊగిసలాటను ద్వేషిస్తారు. డేటా, నిర్మాణం, దృఢమైన తార్కికతతో వీరికి సహాయకారిగా ఉండండి. నాటకీయత వద్దు. ప్రాక్టికల్‌గా ఉండండి. భావోద్వేగ విజ్ఞప్తులతో, అస్పష్టమైన నిబద్ధతలతో లేదా ఒక పనిని దాటవేయడం ద్వారా వారిని నిరాశపరచకండి.సపోర్టర్లు నిశ్శబ్దంగా ఉంటారు. నమ్మదగినవారు. సేవా దృక్పథం కలిగినవారు. స్థిరమైన జట్లకు వెన్నెముకగా ఉండాలని కోరుకుంటారు. స్థిరంగా, శ్రద్ధగా, విశ్వాసపాత్రంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాలకు విలువ ఇస్తారు. వీరి దగ్గర మీరు స్థిరంగా, సానుభూతితో, మర్యాదగా ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అదనపు పని చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు బాగా రాణిస్తారు. మాటలతో కాకుండా చేతలతో మీరు నమ్మకాన్ని సంపాదించాలి. మీలోని దూకుడు ప్రవర్తన, ఆకస్మిక మార్పులు, టీమ్‌ని విమర్శించటం వంటి పనులతో వీరికి దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది.మ్యావరిక్లు చురుగ్గా, వేగంగా, వ్యూహాత్మకంగా ఉంటారు. వీరిది నో–నాన్సెన్ ధోరణి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు కూడా అలాగే ఉండాలని ఆశిస్తారు. పనులు పూర్తి చేసే వారిని విలువైనవారిగా భావిస్తారు. తన ఉద్యోగులు సమయాన్ని గౌరవించాలని, ఒత్తిళ్లను స్వీకరించాలని కోరుకుంటారు. మితిమీరిన ప్రణాళికల్ని ఇష్టపడరు. అధిక డాక్యుమెంటేషన్‌ను కూడా లైక్ చెయ్యరు. ప్రతిదానికీ నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంటే మిమ్మల్ని నిష్కర్షగా పక్కనపెట్టేస్తారు.ఫ్రీ స్పిరిట్ కలిగినవారు స్వతంత్రమైన, సృజనాత్మకమైన, హృదయపూర్వకమైన గుణాలున్నవారు. వీరికి విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. తన టీమ్‌కు స్వేచ్ఛను ఇస్తారు. మీలో అభిరుచి, చొరవ ఉంటే మిమ్మల్ని టీమ్ లీడర్‌గా గుర్తిస్తారు. వీరితో నిజాయితీగా, దాపరికం లేకుండా ఉండాలి.మీ బాస్ సరే, మీరు ఎలాంటి వారు?ఇది తెలుసుకోవాలంటే 41 క్యూ.కామ్ లేదా 16 పర్సనాలిటీస్.కామ్‌లో ఈ ఎం.బి.టి.ఐ. ఆన్లైన్ పరీక్ష రాయండి. ఎలాంటి బాస్ మీకు సరిపడతారో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్· సాక్షి, స్పెషల్ డెస్క్ -
అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెజాన్‌లో పనిచేసే ఉద్యోగులకు వర్క్‌లోడ్‌తో ఆత్మహత్య చేసుకునే ధోరణి పెరిగిపోయింది. ఒక్కోసారి ఆ ఒత్తిడి తట్టుకోలేక తోటి ఉద్యోగులపై దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈకామర్స్ సంస్థ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. తోటి ఉద్యోగులపై దాడి చేయొద్దు. హింసను ప్రోత్సహించొద్దంటూ మెయిల్లో పేర్కొంది. ప్రస్తుతం ఆ మెయిల్ లీకవ్వడంతో అమెజాన్ ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో చూడండి అంటూ మాజీ ఉద్యోగులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అమెజాన్ యాజమాన్యం అందులో పనిచేసే ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. పెరిగిన పనిభారం కారణంగా 'ఆత్మహత్య' చేసుకునే ఆలోచనలు ఎలా పెరుగుతుంటాయో నొక్కి చెప్పింది. 'మీ మానసిక ఆరోగ్యం ముఖ్యమని గుర్తుంచుకోండి. మీరు ఒత్తిడికి గురై నిరాశ, ఆందోళన లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటే సంబంధిత విభాగానికి చెందిన మీ మేనేజర్, హెచ్ ఆర్ లేదా, మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడండి' అంటూ మెయిల్స్‌లో పేర్కొంది. అంతేకాదు పనిభారం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భావిస్తే వృత్తిపరమైన సహాయం తీసుకోవాలని అమెజాన్ ఉద్యోగుల్ని ప్రోత్సహించింది. అయితే పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ మాజీ ఉద్యోగి అమెజాన్ ఉద్యోగులకు పంపిన మెయిల్‌ను లీక్ చేశారు. ఈ సందర్భంగా సదరు ఉద్యోగి మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం ప్రైమ్ మెంబర్ల కోసం ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్ సందర్భంగా ఆర్డర్ల సంఖ్య పెరిగిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అమెజాన్ వన్ డే డెలివరీ ఆఫర్ లో లాజిస్టిక్స్ బృందంలో పని చేసే ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సెలవులు తీసుకోకుండా ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు బుక్ చేసుకున్న ఆర్డర్స్‌ను పంపే సమయంలో ప్రతి ఒక్క ఉద్యోగి చాలా బిజీగా ఉంటాడు. ఒత్తిడి గురవ్వడం, ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం, లేదంటే తోటి ఉద్యోగులపై దాడి చేయాలనే ఆలోచనలు ఎక్కవైతుంటాయని సదరు అమెజాన్ మాజీ ఉద్యోగి తెలిపారు. అమెజాన్‌లో నాలుగేళ్లు పనిచేశాను. యాజమాన్యం ఎప్పుడూ ఇలాంటి మెయిల్స్‌ను ఉద్యోగులకు పంపిన దాఖలాలు లేవు. కానీ ఈ మధ్య కాలంలో అమెజాన్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఈ తరహా జాగ్రత్తలు తీసుకుటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శ -
ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది!
థింక్ డిఫరెంట్ క్యాప్షన్ తో ప్రపంచ టెక్ మార్కెట్‌ను శాసిస్తున్న ఆపిల్ మరో అడుగు ముందుకేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురైనా ఆ ప్లాట్ ఫామ్‌లో ఎకరువు పెట్టేలా నిర్ణయం తీసుకుంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాను లైంగిక ఆరోపణలు మాయని మచ్చని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఈ తరహా చర్యలు తీసుకోవడం టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆపిల్ సంస్థలో వరల్డ్ వైడ్‌గా పనిచేస్తున్న 500 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. అభిప్రాయాలతో పాటు జాత్యహంకారం, లింగవివక్ష, అసమానత్వం, వివక్ష, బెదిరింపు, అణచివేత, బలవంతం, దుర్వినియోగం ఇలా అన్నీ అంశాల్లో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంది. #appletoo,#metto అని పిలిచే ఈ వేదికకు ఆపిల్ సంస్థ గ్లోబల్ సెక్యూరిటీ టీమ్‌లో సెక్యూరిటీ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చెర్ స్కార్లెట్' ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చెర్ స్కార్లెట్ మాట్లాడుతూ..ఆపిల్‌లో నిజమైన మార్పును చూడాలనుకుంటున్న ఆపిల్ ఉద్యోగులు పనివేళల్లో తలెత్తుతున్న సమస్యల గురించి స్పందించాలని కోరుతున్నాం.దీంతో ఆపిల్‌లో బాసిజంతో పాటు రకరకాల వేధింపులకు గురి చేస్తున్న వారికి చెక్ పెట్టినట్లవుతుంది' అని అన్నారు. ఇందులో మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు సైతం పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఆపిల్ నిర్ణయంపై టెక్ దిగ్గజ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. థింక్ డిఫరెంట్‌తో సొంత సంస్థలో ఉద్యోగుల వేధింపుల గురించి బహిరంగంగా చర్చించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి : ఆన్ లైన్ గేమ్స్: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి! -
#మీటూ దెబ్బకు జంకుతున్న ఆఫీసులు
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమం.. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు గొంతుకగా నిలిచింది. ఈ మూవ్‌మెంట్‌తో ఎంతో మంది సెలబ్రిటీల చీకటి వ్యవహారాలు వెలుగు చూశాయి. అన్ని రంగాల్లోని మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమ చేదు అనుభవాలను ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఈ మీటూ దెబ్బకు ప్రధాన కార్యాలయాలన్నీ వణికిపోతున్నాయని ఓ స్టడీలో వెల్లడైంది. తమ కార్యాలయాల్లో ఉద్యోగులు రొమాన్స్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నాయని ఆ స్టడీ పేర్కొంది. సుమారు 80 మంది హెచ్ఆర్ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఉద్యోగుల ప్రేమ వ్యవహారాలను అనుమతించడం చాలా వరకు తగ్గించినట్లు పేర్కొన్నారని వెల్లడించింది. అంతే కాకుండా యూకేలో సుమారు 20 సంస్థలు.. ఇలాంటి వ్యవహారాలపై పూర్తిగా నిషేధం కూడా విధించాయని, 78 శాతం కంపెనీలు.. ఉద్యోగుల సంబంధాల అంశంలో ఉన్న నియమ నిబంధనలను పున:సమీక్షించి మార్చాయని కూడా పేర్కొంది. -
మహిళకు బూతుపదంతో ఈమెయిల్ పంపి..!
ముంబై: మహిళా ఉద్యోగికి అసభ్యంగా బూతుపదంతో ఈమెయిల్ పంపిన ఓ ప్రబుద్ధుడు జైలుపాలయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో 52 ఏళ్ల నిందితుడు 30 ఏళ్ల మహిళా జర్నలిస్టుకు బూతుపదంతో ఈమెయిల్ పంపాడు. కొన్ని కారణాలతో అతను పంపిన ఈమెయిల్ చూసి షాక్ తిన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుడు అప్పటి నుంచి అమెరికాలోనే ఉండిపోయాడు. భారత పోలీసులు సమన్లు పంపించినా అతను స్పందించలేదు. అతను సోమవారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా.. లుకౌట్ నోటీసులతో కాచుకొని ఉన్న అధికారులు అతన్ని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపులు, మహిళలను అసభ్యంగా దూషించి వేధించడం, పని ప్రదేశాల్లో మహిళలను వేధింపులకు గురిచేయడం వంటి పలు అభియోగాలను నమోదుచేసి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాపం మగాళ్లు.. వేధింపులకు బలిపశువులు
ఉద్యోగాలు చేస్తున్న పురుష పుంగవులూ.. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో కార్యాలయాల్లో మగాళ్ల మీద వేధింపులు చాలా ఎక్కువయ్యాయట. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూయూటీ), రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఎంఐటీ)లకు చెందిన పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన చేశారు. గడిచిన ఆరు నెలల్లో వచ్చిన 282 ఫిర్యాదులను వీళ్లు సమీక్షించారు. వీటిలో 78 శాతం వరకు పురుషులు తమ మహిళా సహోద్యోగులను వేధిస్తున్నట్లు ఉన్నాయి. అయితే, మరో 11 శాతం కేసుల్లో మాత్రం పురుషులకు ఇతర పురుషుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని ప్రొఫెసర్ పౌలా మెక్‌డోనాల్డ్ తెలిపారు. అందిన ఫిర్యాదుల కంటే, వాస్తవంగా అక్కడి పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటున్నాయని ఆమె తెలిపారు. పురుషులపై పురుషుల లైంగిక వేధింపులు బాగా పెరిగాయని, ఈ తరహా ఫిర్యాదులు కూడా ఎక్కువగానే వస్తున్నాయని ఆమె అన్నారు. కార్యాలయాల్లో మేనేజర్లు ఈ తరహా వ్యవహారాలను ఓ కంట కనిపెట్టి ఉంచాలని, మగాళ్లకు కూడా రక్షణ అవసరమేనని ఆమె హెచ్చరించారు. ఆడవాళ్ల మీద ఆడవాళ్లు చేసే లైంగిక వేధింపులు కాస్త తక్కువగానే ఉంటున్నాయని, చాలావరకు ఉన్నతాధికారులైన మహిళలే తమ కింద పనిచేసే మహిళలను వేధిస్తున్నారని పరిశోధనలో తేలింది.