breaking news
Windies team
-
సిరీస్‌పై గురి
కరీబియన్ పర్యటనలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను అజేయంగా ముగించేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. టి20ల్లో క్లీన్ స్వీప్ చేసి, రెండో వన్డేలో సునాయాస విజయం సాధించిన కోహ్లి సేన... ఆఖరిదైన మూడో వన్డేనూ హస్తగతం చేసుకుని సిరీస్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది. వెస్టిండీస్ మాత్రం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సొంతగడ్డపై పరువు దక్కించుకోవాలని చూస్తోంది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్‌ను నిలువరించాలన్నా, తమ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్‌కు ఘనంగా వీడ్కోలు ఇవ్వాలన్నా ఆ జట్టు శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్: నిన్నటివరకు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానంపై సాగిన చర్చ... ఇప్పుడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్ వైపు మళ్లింది. ప్రపంచ కప్‌లో అద్భుత సెంచరీతో ఊపుమీదున్న స్థితిలో గాయంతో వైదొలగిన ధావన్ పునరాగమనంలో పరుగులకు ఇబ్బంది పడుతున్నాడు. టి20ల్లో, రెండో వన్డేలో అతడు ఏమాత్రం సాధికారికంగా ఆడలేకపోయాడు. బుధవారం వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనైనా ధావన్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. విజయాల ఊపులో ఉన్న భారత్ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడితే మరో సిరీస్ మన ఖాతాలో చేరడం ఖాయం. సిరీస్‌ను సమ చేయడంతో పాటు కెరీర్లో ఆఖరి మ్యాచ్‌గా ప్రకటించిన గేల్‌ను గౌరవంగా సాగనంపడం ఇప్పుడు కరీబియన్ల ముందున్న రెండు లక్ష్యాలు. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే భారత్ బరిలో దిగనుండగా... విండీస్ ఒక మార్పు చేయనున్నట్లు తెలుస్తోంది. అతడి ఆటపైనే దృష్టి... ధావన్ ఫామ్ కోసం కష్టాలు పడుతుండటంతో జట్టుకు శుభారంభాలు దక్కడం లేదు. రెండో వన్డేలో రోహిత్ కూడా విఫలమడంతో కష్టాల్లో పడింది. కెప్టెన్ కోహ్లి అద్భుత శతకం, యువ శ్రేయస్ అయ్యర్ సమయోచిత అర్ధసెంచరీతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో ఓపెనర్లు రాణిస్తే భారత్ ఆదిలోనే పైచేయి సాధిస్తుంది. పలుసార్లు విఫలమైనా నాలుగో నంబరులో రిషభ్ పంత్‌నే దించే అవకాశం కనిపిస్తోంది. ఆరో స్థానంలో వచ్చే జాదవ్‌కూ ఈ మ్యాచ్ కీలకమే. స్పిన్ ద్వయం జడేజా, కుల్దీప్... పేస్ త్రయం షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్‌లతో భారత బౌలింగ్ పటిష్టంగా ఉంది. వీరిని ఎదుర్కొంటూ పరుగులు సాధిచండం ప్రత్యర్థికి బ్యాట్స్‌మెన్‌కు సవాలేనని రెండో వన్డేలో స్పష్టమైంది. ఓ దశలో చేజారేలా కనిపించిన మ్యాచ్‌ను బౌలర్లు మనవైపు తిప్పారు. మూడో వన్డేలోనూ ఇదే జోరు చూపితే ప్రపంచ కప్ నిష్క్రమణను మరిపిస్తూ టెస్టు చాంపియన్ షిప్‌నకు ఆత్మవిశ్వాసంతో వెళ్లొచ్చు. విండీస్‌కు బ్యాటింగ్ బెంగ... బౌలింగ్‌లో ఫర్వాలేకున్నా బ్యాటింగ్ వెస్టిండీస్‌ను కలవరపరుస్తోంది. విధ్వంసక క్రిస్ గేల్ తన ఆఖరి మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్‌లతో భారీ లైనప్ ఉన్నా ఎవరి నుంచి విన్నింగ్ ఇన్నింగ్స్ రావడం లేదు. ఆరు వికెట్లు చేతిలో ఉన్నా రెండో వన్డేలో 71 బంతుల్లో 91 పరుగుల చేయలేకపోవడమే దీనికి నిదర్శనం. ఓపెనర్లలో లూయిస్ స్థానంలో క్యాంప్‌బెల్‌ను తీసుకోవచ్చని భావిస్తున్నా అందుకు పెద్దగా అవకాశాల్లేవు. లోయరార్డర్లో కెప్టెన్ హోల్డర్, బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిప్తేనే ఆతిథ్య జట్టు గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. పార్ట్‌టైమర్ చేజ్‌తో కొంత ప్రయత్నిస్తున్నా స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం విండీస్‌కు లోటు. రోచ్, కాట్రెల్, థామస్‌ల పేస్ త్రయం అనూహ్యంగా చెలరేగితే టీమిండియాకు కళ్లెం పడుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: ధావన్, రోహిత్, కోహ్లి (కెప్టెన్), అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, ఖలీల్. వెస్టిండీస్: గేల్, లూయిస్/క్యాంప్‌బెల్, హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్, హోల్డర్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్, థామస్. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు అంతంతమాత్రమే సహకరించిన, రెండో వన్డే ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ జరగనుంది. వాతావరణ పరిస్థితులు చూస్తే అంతరాయాలు తప్పకపోవచ్చని సమాచారం. జల్లుల వాన కురిసే వీలుంది. ఈ ప్రకారం చూస్తే టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవచ్చు. -
ప్రపంచకప్‌లో విండీస్ వైస్ కెప్టెన్‌గా గేల్
జమైకా: ప్రపంచకప్‌లో పాల్గొనే విండీస్ జట్టుకు విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. గేల్‌కు ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ ఐదో ఈవెంట్. దీంతోనే అతను వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. అయితే యథావిధిగా ప్రపంచ టి20 లీగ్‌లలో మాత్రం అతను మెరుపులు మెరిపిస్తాడు. ‘విండీస్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని నేనెప్పుడూ గౌరవంగా భావిస్తాను. ఈ ప్రపంచకప్ నాకు మరింత ప్రత్యేకమైంది. సీనియర్ ప్లేయర్‌గా కెప్టెన్‌కు అండగా ఉంటాను. జట్టును ముందుండి నడిపిస్తాను. జట్టులో ప్రతి ఒక్కరు విండీస్ విజయం కోసం పాటుపడతారు’ అని 39 ఏళ్ల గేల్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన గేల్ 490 పరుగులతో బ్యాట్స్‌మన్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. లీగ్ దశలో కింగ్స్ ఎలెవన్ ఇంటిబాట పట్టడంతో అతనిప్పుడు ప్రపంచకప్ తుది సన్నాహాల్లో బిజీగా ఉన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న గేల్ సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లోనూ అదరగొట్టాడు. రెండేసి సెంచరీలు, అర్ధ సెంచరీలు బాదాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 289 వన్డేలాడిన గేల్ 38.16 సగటుతో 10,151 పరుగులు చేశాడు. -
విండీస్ జట్టులో రెండు మార్పులు
నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): భారత్‌తో జరుగనున్న మిగతా మూడు వన్డేల్లో తలపడే విండీస్ జట్టును బుధవారం ప్రకటించారు. ఇద్దరు యువ క్రికెటర్లు విండీస్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. జొనాథన్ కార్టర్, విలియమ్స్ స్థానంలో కైల్ హోప్, సునీల్ ఆంబ్రిస్‌లకు సెలక్టర్లు చోటు కల్పించారు. వీరిద్దరూ భారత్‌తో శుక్రవారం జరిగే మూడో వన్డేలో అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుత విండీస్ జట్టు వికెట్ కీపర్ షై హోప్ సోదరుడైన కైల్ హోప్ దేశవాళీల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున ఆడగా... సునీల్ ఆంబ్రిస్ విండ్వర్డ్ ఐలాండ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం భారత్ 1–0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, రెండో వన్డేలో భారత్ 105 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.