రోడ్డు పాలైన ఓట్లు
విజయనగరం: అధికారులు నిర్లక్ష్యంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేశారు. ప్రజల ఓట్లను రోడ్డు పాల్జేశారు. బ్యాలెట్ బాక్సులను తరలిస్తుండగా బస్సులోంచి ఒక బ్యాలెట్ బాక్స్ జారిపడింది. బాక్స్‌కు సీల్ లేకపోవడంతో ఓట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
విజయనగరం జిల్లా వేపాడ మండలం బత్తవానిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిందపడిన బ్యాలెట్ బాక్స్ నీలకంఠరాజపురం 31 పోలింగ్ బూత్‌కు చెందినదిగా గుర్తించారు. ఈ విషయంలో మీడియా కంట్లో పడకుండా ఉండేందుకు అధికారులు యత్నించారు. మీడియా రావొద్దంటూ ఆంక్షలు విధించారు.
ఈ ఘటనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విచారణ కోసం జిల్లా కలెక్టర్ వేపాడకు బయలు దేరారు.