breaking news
Vote as crore case
-
‘దేశం’లో ... దొంగలు పడ్డారు
ఇంటి గుట్టును రట్టు చేసిన సొంతింటి వారి పుణ్యమాని టీడీపీ తమ్ముళ్లకు దిమ్మతిరిగి ‘మైండ్ బ్లాక్ ’ అయ్యింది. ‘ఓటుకు కోట్లు’ కేసుతో వారికిప్పుడు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఇంత అడ్డంగా దొరికిపోవడానికి తమలో ‘విభీషణుడు’ ఎవరా అని తలలు బద్దలు కొట్టుకున్నారు. బలమే లేకుండా ఎలా గెలవాలో .. ఎవరిని కొంటున్నామో తమ అధినేత చంద్రబాబుకు సినిమా స్కోపులో చూపించిన వివరం కాస్తా ఎదుటి శిబిరానికి చేరిపోయింది. సమయం కోసం కాచుక్కూర్చుని వల విసరడంతో పాతికేళ్ల ప్రాయం దగ్గర పడుతున్న పచ్చపార్టీకి రంగు పడింది. అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే రేవంత్ ఏడు చువ్వల వెనక్కి వెళ్లారు. ఇంతకూ... ఈ లీకులు ఇచ్చింది ఎవరా అని ‘తవ్వకాలు’ జరిపిన ‘దేశం’ తమ్ముళ్లకు ఇంటి దొంగ ఎవరో తెలిసిపోయిందంటున్నారు. ఆధిపత్య పోరుతో ఏడాదిగా సతమతమవుతున్న వారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. తమకు అడ్డులేకుండా చేసుకున్నారన్నది ‘దేశం’ శిబిరంలో చక్కర్లు కొడుతున్న కొత్త వార్త. అయితే, అధినేత పీఠానికే ఎసరు తెచ్చేలా వ్యవహరించిన ఆ నేతకు భవిష్యత్తుపై కొంత బెంగ ఉన్నా.. స్వపక్షంలోని ప్రత్యర్థి అడ్డుతొలగిందని, ఇక్కడ తాను తప్ప పార్టీకి దిక్కెవరని ధిక్కార స్వరం వినిపిస్తున్నాట్ట. ఏమీ లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షం కాబట్టి .. భరించక తప్పుతుందా అని టీడీపీ నాయకత్వం సమాధాన పడుతోందట. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న చంద్రబాబు
* ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం తీరుపై పాత్రికేయుల ఆగ్రహం * అర్ధరాత్రి టీ చానల్‌కు నోటీసులు ఇవ్వడంపై మండిపాటు * నోటీసులు ఉపసంహరించు కోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారని, తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. శనివారమిక్కడ టీ న్యూస్ చానల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలు చానళ్లకు చెందిన సీఈఓలు, పత్రికా ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రెస్‌అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కావాలని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. ఈ కేసులో చంద్రబాబు అవినీతి బాగోతాలను బయటపెట్టిన టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. వెంటనే నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ... తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లి మన్నన పొందాలే తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నేరస్తులు అవుతామనే చిన్న లాజిక్‌ను కూడా చంద్రబాబు తెలుసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చర్యలను చూస్తుంటే దేశంలో మరోసారి ఎమర్జెన్సీ నిజంగానే వచ్చేలా కనిపిస్తోందన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు నేరం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నందునే.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ... నోటీసులు ఇచ్చిన తీరు, అంతకుముందు జరిగిన రాజకీయ ప్రకటనలు చూస్తే ఆధిపత్యంతో దాడిచేసి లొంగదీసుకోవడానికి చూసే పక్రియలా కనిపిస్తోందన్నారు. టేపులు బయటకు వచ్చి రెండు వారాలు గడుస్తున్నా అది తన గొంతో కాదో ఇప్పటివరకూ చెప్పకుండా ఓ మీడియా సంస్థకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 6టీవీ సీఈవో శైలేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు టీ చానల్‌కు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, టీ న్యూస్ సీఈవో నారాయణరెడ్డి, గౌరీ శంకర్ (దక్కన్ క్రానికల్), ఆర్.రవికాంత్‌రెడ్డి (ద హిందూ), ఈశ్వర్‌రెడ్డి(ఆంధ్రభూమి) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ), పల్లెరవికుమార్, విరాసత్ఆలీ తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళన: టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్యలు తెలిపారు.