breaking news
Vinay Pradhan
-
‘పప్పు(రాహుల్) విముక్త భారతే నా లక్ష్యం’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పు అని పిలిచి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వినయ్ ప్రధాన్ అనే కాంగ్రెస్ పార్టీ నేత తాజాగా కాంగ్రెస్‌ను పూర్తిగా వదిలేశారు. తాను పార్టీలో నుంచి వైదొలుగుతున్నానని, తాను త్వరలో పప్పు విముక్త(రాహుల్‌గాంధీ విముక్త) భారతం అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. కాంగ్రెస్ విముక్త భారతం అని బీజేపీ ఇచ్చిన నినాదం మాదిరిగానే అతడు పప్పు ముక్త్ భారత్ అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తానని తెలిపారు. వినయ్ ప్రధాన్ కాంగ్రెస్ పార్టీలో 22 ఏళ్లుగా పనిచేశాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరుతారా లేక మరింకేదైనా పార్టీలోనా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అంతేకాదు.. పప్పు విముక్త భారతం అనే నినాదంతో ఆయన ఏ విధంగా ముందుకు వెళతారో అనే విషయాన్ని కూడా వివరించలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు తన లక్ష్యం కోసం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాహుల్‌గాంధీ చుట్టూ సైకోలో ఉన్నారని తీవ్రంగా విమర్శించిన ఆయన వారి ద్వారానే త్వరలో కాంగ్రెస్ విముక్తి భారత్ కూడా సాధ్యమవుతుందని తెలిపారు. వినయ్ ప్రధాన్ మీరట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. -
అధినేతను ‘పప్పు’ అని..వాట్సప్‌లో వైరల్!
మీరట్ (ఉత్తరప్రదేశ్) : ‘దేశంలో చాలామంది ప్రజలు రాహుల్‌గాంధీని ‘పప్పు’ అని అంటున్నారు. కానీ పప్పు ఎప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపలేదన్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాలి’ ఇది వాట్సాప్‌లో సాక్షాత్తు ఓ కాంగ్రెస్ నాయకుడు పెట్టిన కామెంట్. ఏకంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను ఉద్దేశించి ‘పప్పు’ అనడంతో ఆయనపై వేటుపడింది. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా అధ్యక్షుడైన వినయ్ ప్రధాన్ రాహుల్‌ను ఉద్దేశించి ఇటీవల వాట్సప్ గ్రూప్‌లో చేసిన వ్యాఖ్యలు స్థానికంగా వైరల్ అయ్యాయి. రాహుల్‌ను ‘పప్పు’ అని పేర్కొంటూ ఆయన మెసేజ్‌లు పెట్టడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆయనను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు యూపీ పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ ప్రకటించారు. అయితే, తాను ఆ మెసేజ్‌లు పెట్టలేదని, తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రత్యర్థులు ఈ కుట్ర పన్నారని వినయ్ ప్రధాన్ అంటున్నారు. ఈ విషయంలో తన వివరణ కూడా తీసుకోకుండా వేటు వేయడం సరికాదని ఆయన వాపోతున్నారు.