breaking news
Vidarbha region
-
మూడు రోజుల్లో 12 మంది విదర్భ రైతుల ఆత్మహత్య
నాగపూర్ : విదర్భ ప్రాంతంలో గత 72 గంటల్లో 12 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆదివారం విదర్భ జన్ ఆందోళన్ సమితి అధినేత కిషోర్ తివారి తెలిపారు. వీరందరూ పత్తిని ఎక్కువగా పండించే పశ్చిమ విదర్భ ప్రాంతానికి చెందినవారేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కరువు వల్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, దాంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు ఆత్మహత్యను ఆశ్రయిస్తున్నారని తివారి ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిరైతుకు మద్దతు ధరను పెంచేందుకు ప్రభుత్వం కృషిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
విదర్భపైనే ‘కాంగ్రెస్’ గురి
నాగపూర్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి విదర్భ ప్రాంతంపై తిరిగి ఆశలు పెంచుకుంటోంది. 1990 నుంచి ఈ కూటమిని విదర్భ ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. గత ఐదు దఫాల అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. 1990లో జరిగిన ఎన్నికల్లో విదర్భలో ఉన్న 62 స్థానాల్లో కాంగ్రెస్ 25 స్థానాలను కైవసం చేసుకుంది. తర్వాత 1999లో 52 స్థానాలకు గాను 27ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, 2004 ఎన్నికల నుంచి కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి పోటీపడుతున్నాయి. ఇదిలా ఉండగా, 2004 ఎన్నికల్లో 49 సీట్లకుగాను కాంగ్రెస్ 19 స్థానాలను, 15 స్థానాల్లో పోటీచేసిన ఎన్సీపీ 11 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎన్సీపీ కొంతమేర దెబ్బతింది. 13 స్థానాల్లో పోటీచేసి కేవలం నాలుగింటినే గెలుచుకోగలిగింది. అదే సమయంలో 48 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 24 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా ఓట్ల శాతం బట్టి చూస్తే విదర్భలో 2009 ఎన్నికల్లోనే కాంగ్రెస్ 36.04 శాతం ఓట్లు (27,59,925) సంపాదించుకుంది. ఇదిలా ఉండగా 2004 ఎన్నికల్లో 49 సీట్లకు గాను 19 మాత్రమే (23,73,717 ఓట్లు) కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో 15 సీట్లలో పోటీచేసిన ఎన్సీపీ అత్యధికంగా 11 సీట్లను గెలుచుకుంది. కాగా, 1995 ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ-శివసేన కూటమికి విదర్భలోని మొత్తం 66 సీట్లలో 33 సీట్లు (బీజేపీ-22, శివసేన-11) గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలకు పోటీపడి 24.60 శాతం ఓట్లతో 17 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, శివసేన-బీజేపీ కూటమికి 1990లో 24.63 శాతం ఓట్లు రాగా, 1995లో 25.82 శాతం, 1999లో 33.92 శాతం, 2004లో 32.97 ఓట్లు పోలయ్యాయి. కాగా, 2009 ఎన్నికల్లో ఆ కూటమికి 33.92 శాతం ఓట్లు పడ్డాయి. -
విదర్భ ప్రాంతంలో జౌళి పరిశ్రమ విస్తరణ
నాగపూర్: విదర్భ ప్రాంతంలో రాష్ట్ర జౌళి మంత్రిత్వ శాఖ భారీ విస్తరణ ప్రణాళిక చేపట్టింది. రూ. 1,800 కోట్ల వ్యయంతో 15 వేల ఉద్యోగాలు కల్పిం చేం దుకు అధికార వర్గాలు ఓ ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం 500 జౌళి పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, మరి కొన్ని పరిశ్రమలను నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జౌళి శాఖ మంత్రి మహ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 14 టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, వీటి పెట్టుబడుల విలువ 16 వేల కోట్ల రూపాయలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 టెక్స్టైల్ పార్కులు ఉన్నాయని ఆయన వివరించారు. విదర్భ ప్రాంతంలో సంవత్సరానికి 90 లక్షల బెయిళ్ల పత్తి పండిస్తున్నారని, ఇందులో కొంతమాత్రమే రాష్ట్ర పరిశ్రమలు వినియోగించుకుంటున్నాయని, మిగతాది ఎగుమతి అవుతుందన్నారు.