‘మేం దీపావళి చేసుకోం’.. పీఎన్బీ బాధితులు
గ్రేటర్ నోయిడా: గ్రేటర్ నోయిడాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఖాతాదారుల ఆందోళన పదో రోజుకు చేరింది. బ్యాంకులో జరిగిన రూ.10.24 కోట్ల మోసంతో తమ జీవితకాల పొదుపు సొమ్మును కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు తిరిగి వచ్చే వరకు దీపావళి జరుపుకోబోమని స్పష్టం చేశారు. సెక్టార్ పై-1లోని పీఎన్బీ శాఖ ఎదుట నవంబర్ 3న కూడా బాధితులు నిరసన కొనసాగించారు.తమ ఖాతాల నుంచి అనుమతి లేకుండా నగదు బదిలీ అయినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లు, లావాదేవీల వివరాలను ఆధారాలుగా చూపిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని, ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఘజియాబాద్ అవినీతి నిరోధక విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.దీపాంశి అనే మహిళా బ్యాంకు ఉద్యోగిని ఆరుగురు అధికారుల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి దాదాపు మూడేళ్లపాటు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆశుతోష్ పాఠక్ సహా పలువురి ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 49 అనుమానాస్పద ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన రూ.70.23 కోట్ల లావాదేవీలపైనా విచారణ జరుగుతోంది. మరోవైపు ముగ్గురు ఖాతాదారులకు రూ.43 లక్షల క్లెయిమ్‌లు పరిష్కరించినట్లు పీఎన్బీ తెలిపింది. తమ సొమ్ము తిరిగి ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు తేల్చిచెబుతున్నారు. ఇదీ చదవండి: ట్రంప్ ఖాతాలో 127 విజయాలు.. భారత్‌కూ లబ్ధి అంటూ..