breaking news
Venkatapathi Raju
-
హెచ్‌సీఏ సలహా కమిటీలో లక్ష్మణ్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో కొత్తగా క్రికెట్ సలహా కమిటీ ఏర్పాటైంది. ఈనెల 12న జరిగిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ స్పిన్నర్ వెంకటపతిరాజు, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ పూర్ణిమా రావు ఇందులో సభ్యులుగా ఉంటారని హెచ్‌సీఏ పేర్కొంది. తమ విజ్ఞప్తిని అంగీకరించిన వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు హెచ్‌సీఏ కార్యదర్శి టి.శేష్ నారాయణ్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అభ్యున్నతికి ఈ కమిటీ సభ్యులు అపెక్స్ కౌన్సిల్‌కు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ‘కమిటీలో భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్ మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుంది’ అని లక్ష్మణ్ అన్నారు. క్రికెట్ వ్యవహారాల కోసం ఇటీవల ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్‌కు సహాయంగా ఉండేందుకు తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు వెంకటపతి రాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే అపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమని పూర్ణిమా రావు అన్నారు. తెలంగాణలో మహిళా క్రికెట్ అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. -
బైక్ ఢీకొని స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి మృతి
విశాఖపట్టణం: విశాఖపట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి ఒకరు చనిపోయారు. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేసే వెంకటపతిరాజు విధుల నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా ఆటోనగర్ సిగ్నల్ పాయింట్ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటపతిరాజు తలకు తీవ్ర గాయాలై... అక్కడికక్కడే మరణించాడు. మరో బైక్‌పై ఉన్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.