veera brahmendra swamy
-
బ్రహ్మంగారి మఠం... ఆరంభమైన ఆరాధనోత్సవాలు
ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. అంత గొప్ప కాలజ్ఞాని, రాజయోగి, హేతువాది, తత్త్వవేత్త, మహిమాన్వితుడు, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులుగా వినుతికెక్కిన శ్రీ మద్విరాట్పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ (కడప) జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో.. ఆదివారం అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. ఇందుకోసం క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మానవులకు జ్ఞానబోద చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన విశ్వబ్రాహ్మణ దంపతులైన ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులుకు ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని సరస్వతీ నదీ తీరంలో క్రీ.శ.1608లో జన్మించారు. వెంటనే తల్లిదండ్రులను కోల్పోయారు. అత్రి మహాముని ఆశ్రమంలో శిష్యుడిగా పెరిగారు. కర్ణాటక రాష్ట్రం పాపాగ్ని మఠం (ప్రస్తుతం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది) మఠాధిపతులు యనమదల వీరభోజయాచార్య, వీరపాపమాంబ అనే విశ్వబ్రాహ్మణ వృద్ధ దంపతులు దత్తత తీసుకున్నారు. కొంత కాలానికి వీరభోజయాచార్య సహజ మరణం పొందారు. బ్రహ్మంగారు తన ఎనిమిదవ ఏటనే లోక సంచార నిమిత్తం బయలుదేరారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లె చేరుకున్నారు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉన్నారు. రవ్వలకొండలోని గుహలో కాలజ్ఞాన రచన చేశారు. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు అచ్చమ్మ ఇంటిలో పాతర తీసి భద్రపరిచారు. యాగంటి గుహలో తపస్సు చేశారు. అచ్చమ్మ, వెంకటరెడ్డి దంపతులు బనగానపల్లెలో నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు. అక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్టించి లోక సంచార నిమిత్తం మళ్లీ బయలుదేరారు. దేశ నలుమూలల సంచారం... వైఎస్ఆర్ (కడప) జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం అల్లాడుపల్లెలో.. తాను శిల్పీకరించిన శ్రీవీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. కందిమల్లాయపల్లెలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని పెద్దకొమెర్ల గ్రామానికి చెందిన శివకోటయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. ఐదుగురు పుత్రులు, ఒక పుత్రికను సంతానంగా పొందారు. దూదేకుల కులానికి చెందిన సిద్దయ్య, దళితుడైన కక్కయ్యను శిష్యులుగా స్వీకరించారు. శిష్యగణ సమేతంగా దేశ నలుమూలల సంచరించి వేదాంతతత్వ ప్రచారం చేశారు.కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మసంస్థాపనం గావిస్తామన్నారు. 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది. ఏటా..స్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ నెల 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలి రానున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, మఠం నిర్వాహకులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు. – వి.మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడపఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్య బృందం, భక్తులు.. ఆరాధన, గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలు 9 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిõషేకం, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి.అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 4న శేషవాహనోత్సవం, 5న గజవాహనోత్సవం, 6న నరనంది ఉత్సవం, 7న నంది ఉత్సవం, 8న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 7న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామివారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 9న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
ముక్తి పథం.. బ్రహ్మ రథం
బ్రహ్మంగారిమఠం(అన్నమయ్య జిల్లా): పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు. అనంతరం దివంగత మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి దంపతులతోపాటు ఆయన తమ్ముళ్లు, రెండవ భార్య కుమారులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు స్థానిక మఠం మేనేజర్ ఈశ్వరాచారితో కలిసి రథం వద్దకు చేరుకోగానే ఆలయ పూజారులు పూజలు చేశారు.అనంతరం గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ వెంకటరమణ, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం పరిపాలన ఫిట్పర్సన్ శంకర్ బాలాజీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, ఈశ్వరీదేవిమఠం పీఠాధిపతి వీరశివకుమారస్వామి పాల్గొన్నారు. కిక్కిరిసిన భక్తజనం వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మంగారు, గోవిందమాంబలను కళ్లారా చూసి తరించారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా రథోత్సవాన్ని తిలకించేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వేచి ఉండడమేగాకుండా రథోత్సవం ముగిసేంత వరకు ఉన్నారు. రథోత్సవ శుభ్రత బాధ్యత లింగాలదిన్నెపల్లె భక్తులదే ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవ శుభ్రత బాధ్యతను మండలంలోని లింగాలదిన్నెపల్లె భక్తుడు ఎల్.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన భక్తులు మూడు రోజుల పాటు చేపట్టారు. గురువారం రథోత్సవం రోజు కూడా కీలకంగా వ్యవహరించారు. రాత్రి గజవాహనోత్సవంలో బ్రహ్మంగారు, గోవిందమాంబలు పురవీధుల్లో తిరిగారు. భారీ పోలీసు బందోబస్తు: మైదుకూరు డీఎస్పీ మురళీదర్‌గౌడ్, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిల ఆధ్యర్యంలో ఎస్ఐ విద్యాసాగర్ పర్యవేక్షణలో జిల్లా నుంచి సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సీలతోపాటు 400 మంది పోలీసులు, హోంగార్డులు, మహిళా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. -
మఠాధిపత్యంపై పీఠాధిపతులతో కమిటీ
సాక్షి, అమరావతి: చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్పర్సన్ (పర్సన్ ఇన్చార్జి)గా వైఎస్సార్ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. మంచి నిర్ణయమే తీసుకుంటాం: మంత్రి సమావేశానంతరం మంత్రి వెలంపల్లి ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మఠం పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీలైనంత త్వరగా మఠాధిపతి ఎంపికపై మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలాంటి విద్వేషాలకు తావులేకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మంత్రి కోరారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1693లో జీవ సమాధి అయ్యాక, అప్పటి నుంచి వారి వంశమే మఠాధిపత్యం స్వీకరిస్తూ వచ్చిందని.. ఇలా ఇప్పటివరకు 11 మంది కొనసాగారని ఆయన తెలిపారు. ప్రస్తుత మఠాధిపతి మే 8న పరమపదించారని.. ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరి భార్యల వారసులు పీఠాధిపతి స్థానానికి పోటీపడడంతో వివాదం ఏర్పడిందన్నారు. ఇరుపక్షాలు తమ వద్ద వీలునామాలు ఉన్నాయని చెబుతున్నాయని.. కానీ, ఇప్పటివరకు ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందలేదని మంత్రి వెలంపల్లి చెప్పారు. నిబంధనల ప్రకారం.. వీలునామా రాసిన 90 రోజుల వ్యవధిలో దానికి ఒక విన్నపాన్ని జతపరిచి దేవదాయ శాఖకు అందజేయాల్సి ఉందని.. అయినా ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందనందున తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నందున మఠాధిపతి ఎంపిక సంప్రదాయ బద్ధంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. పీఠాధిపతి ఉన్నప్పుడే తదుపరి ఉత్తరాధికారిని ప్రకటించి ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేదే కాదన్నారు. ముందస్తు నోటీసు ఇచ్చే కమిటీ సమావేశం.. ఇదిలా ఉంటే.. దేవదాయ శాఖ పరిధిలో 128 వరకు మఠాలు, పీఠాలు ఉన్నాయని.. వాటిలో బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలు కలిగిన ఇతర మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని.. కమిటీ సూచనలను ధార్మిక పరిషత్ పరిశీలించి తదుపరి మఠాధిపతి ఎంపిక పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. కమిటీ సమావేశం నిర్వహణకు 30 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సమావేశం నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చని వెలంపల్లి చెప్పారు. -
బ్రహ్మంగారి మాట నిజమౌతోంది
సాక్షి, ఏలూరు : పవిత్రమైన స్వామీజీలను బహిష్కరించడం, అరెస్టు చేయడం దుర్మార్గమని కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. బుధవారం ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఆయన హిందూసంస్థలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ నెల 19న (గురువారం) తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో అన్నీ ధార్మక సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. టీటీడీలో అవకతవకలు బయటపెట్టేందుకు ఈ నెల 29నుండి హిందూ సమాజం రోడ్డెక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మకు సారె సమర్పించిన అనంతరం 30 మంది పీఠాధిపతులతో చలో తిరుపతి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. 300 మంది శిష్యులతో రోజూ 30 కిలోమీటర్లు మేర 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. 500 గ్రామాల్లో హిందూత్వంపై చైతన్యం తీసుకొచ్చి, ఆగస్టు 12న సాయంత్రం తిరుపతిలోని ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు తెలుగు రాష్ట్రాలనుండి 100 మంది పీఠాధిపతులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. తిరుమల గురించి బ్రహ్మంగారు ముందే చెప్పారని, కొండపైకి దారులన్నీ మూసుకుపోయి, ఆరుగురు దొంగలు స్వామి వారి ఆభరణాలు దోచుకుంటారని కాలజ్ఞానంలో చెప్పారని అన్నారు. తొమ్మిది రోజులు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామనడంపై ఇప్పుడు అవే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వానికి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే కమిటీ వేయాలని, హిందూ సమాజానికి భరోసా ఇవ్వాలని డిమాండ్ శివస్వామి డిమాండ్ చేశారు. -
కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం
శెట్టూరు : మండలంలోని బచ్చేహళ్లి గ్రామంలో గురువారం వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం కనులపండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతిపూజ, అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు హోమం, ఒంటి గంటకు మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు గ్రామదేవతల పూజ, గంగపూజ చేపట్టారు. అనంతరం 108 పూర్ణకుంభాలతో రథోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారికి పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి గ్రామ పెద్దల సహకారంతో సాంఘిక నాటిక ప్రదర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఘనంగా వీరబ్రహ్మం కల్యాణం
బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్ధానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మఠాధిపతులు శ్రీవీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి దంపతులు కల్యాణ ఉత్సవంలో పాల్గొనగా కందుకూరి వెంకట గోవిందశర్మ, తెనాలి వేదపాఠశాల ప్రిన్సిపాల్ జనార్ధనాచారి, కొమ్మారి విశ్వరూపాచారి, బి.రామబ్రహ్మం అర్చకులు స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు మఠం ఆస్థాన కవి బ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో వున్న భవిష్యత్తు గురించి భక్తులకు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక మఠం పెద్దాచార్యులు, వీరభద్రాచారి, వేదపండితులు పాల్గొన్నారు. భక్తులకు దర్శనమిచ్చిన మఠాధిపతులు... గురువారం మధ్యాహ్నం మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఆస్థాన మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణ మహోత్సవాలను ఉత్సవాల ప్రత్యేక అధికారి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ ధనుంజయుడు, ఎండోమెంట్ జిల్లా అధికారి, తహవీల్దారు, ఎంపీడీఓ, మఠం మేనేజర్ ఈశ్వరయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈశ్వరిదేవి మఠంలో ఉత్సవాలు... శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనమరాలు మాతా ఈశ్వరిదేవి మఠంలో కూడ స్థానిక ఈ.ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు. -
అనంతలో బ్రహ్మానందం: అభిమానులపై లాఠీచార్జి!
అనంతపురం: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అనంతపురం పర్యటన అభిమానులపై లాఠిచార్జికి దారి తీసింది. గురువారం స్థానిక రానినగర్ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మనందం హాజరయ్యారు. బ్రహ్మనందంను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అభిమానులు అదుపు చేయడానికి భారీ ఎత్తున పోలీసులను నియమించారు. ఓ దశలో అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు నానా కష్టాలు పడ్డారు. పరిస్థితి చాయిదాటిపోతుందనే తరణంలో అభిమానులు, భక్తులపై పోలీసులు లాఠీ చార్జీ జరిపారు. ఈ లాఠీచార్జీలో పలువురు అభిమానులకు స్వల్పంగా గాయపడ్డారు.