
ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. అంత గొప్ప కాలజ్ఞాని, రాజయోగి, హేతువాది, తత్త్వవేత్త, మహిమాన్వితుడు, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులుగా వినుతికెక్కిన శ్రీ మద్విరాట్‌పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ (కడప) జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో.. ఆదివారం అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. ఇందుకోసం క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
మానవులకు జ్ఞానబోద చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన విశ్వబ్రాహ్మణ దంపతులైన ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులుకు ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని సరస్వతీ నదీ తీరంలో క్రీ.శ.1608లో జన్మించారు. వెంటనే తల్లిదండ్రులను కోల్పోయారు. అత్రి మహాముని ఆశ్రమంలో శిష్యుడిగా పెరిగారు. కర్ణాటక రాష్ట్రం పాపాగ్ని మఠం (ప్రస్తుతం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది) మఠాధిపతులు యనమదల వీరభోజయాచార్య, వీరపాపమాంబ అనే విశ్వబ్రాహ్మణ వృద్ధ దంపతులు దత్తత తీసుకున్నారు.
కొంత కాలానికి వీరభోజయాచార్య సహజ మరణం పొందారు. బ్రహ్మంగారు తన ఎనిమిదవ ఏటనే లోక సంచార నిమిత్తం బయలుదేరారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లె చేరుకున్నారు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉన్నారు. రవ్వలకొండలోని గుహలో కాలజ్ఞాన రచన చేశారు. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు అచ్చమ్మ ఇంటిలో పాతర తీసి భద్రపరిచారు. యాగంటి గుహలో తపస్సు చేశారు. అచ్చమ్మ, వెంకటరెడ్డి దంపతులు బనగానపల్లెలో నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు. అక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్టించి లోక సంచార నిమిత్తం మళ్లీ బయలుదేరారు.
దేశ నలుమూలల సంచారం...
వైఎస్‌ఆర్ (కడప) జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం అల్లాడుపల్లెలో.. తాను శిల్పీకరించిన శ్రీవీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. కందిమల్లాయపల్లెలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని పెద్దకొమెర్ల గ్రామానికి చెందిన శివకోటయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. ఐదుగురు పుత్రులు, ఒక పుత్రికను సంతానంగా పొందారు. దూదేకుల కులానికి చెందిన సిద్దయ్య, దళితుడైన కక్కయ్యను శిష్యులుగా స్వీకరించారు. శిష్యగణ సమేతంగా దేశ నలుమూలల సంచరించి వేదాంతతత్వ ప్రచారం చేశారు.
కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మసంస్థాపనం గావిస్తామన్నారు. 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది.
ఏటా..
స్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ నెల 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలి రానున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, మఠం నిర్వాహకులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు.
– వి.మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడప
ఉత్సవాలు ఇలా..
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్య బృందం, భక్తులు.. ఆరాధన, గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలు 9 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిõషేకం, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి.
అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 4న శేషవాహనోత్సవం, 5న గజవాహనోత్సవం, 6న నరనంది ఉత్సవం, 7న నంది ఉత్సవం, 8న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 7న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామివారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 9న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి.