Veera brahmendra swamy Temple
-
బ్రహ్మంగారి మఠం... ఆరంభమైన ఆరాధనోత్సవాలు
ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. అంత గొప్ప కాలజ్ఞాని, రాజయోగి, హేతువాది, తత్త్వవేత్త, మహిమాన్వితుడు, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులుగా వినుతికెక్కిన శ్రీ మద్విరాట్పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ (కడప) జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో.. ఆదివారం అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. ఇందుకోసం క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మానవులకు జ్ఞానబోద చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన విశ్వబ్రాహ్మణ దంపతులైన ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులుకు ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌లోని సరస్వతీ నదీ తీరంలో క్రీ.శ.1608లో జన్మించారు. వెంటనే తల్లిదండ్రులను కోల్పోయారు. అత్రి మహాముని ఆశ్రమంలో శిష్యుడిగా పెరిగారు. కర్ణాటక రాష్ట్రం పాపాగ్ని మఠం (ప్రస్తుతం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది) మఠాధిపతులు యనమదల వీరభోజయాచార్య, వీరపాపమాంబ అనే విశ్వబ్రాహ్మణ వృద్ధ దంపతులు దత్తత తీసుకున్నారు. కొంత కాలానికి వీరభోజయాచార్య సహజ మరణం పొందారు. బ్రహ్మంగారు తన ఎనిమిదవ ఏటనే లోక సంచార నిమిత్తం బయలుదేరారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా బనగానపల్లె చేరుకున్నారు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉన్నారు. రవ్వలకొండలోని గుహలో కాలజ్ఞాన రచన చేశారు. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు అచ్చమ్మ ఇంటిలో పాతర తీసి భద్రపరిచారు. యాగంటి గుహలో తపస్సు చేశారు. అచ్చమ్మ, వెంకటరెడ్డి దంపతులు బనగానపల్లెలో నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు. అక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్టించి లోక సంచార నిమిత్తం మళ్లీ బయలుదేరారు. దేశ నలుమూలల సంచారం... వైఎస్ఆర్ (కడప) జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం అల్లాడుపల్లెలో.. తాను శిల్పీకరించిన శ్రీవీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. కందిమల్లాయపల్లెలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని పెద్దకొమెర్ల గ్రామానికి చెందిన శివకోటయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. ఐదుగురు పుత్రులు, ఒక పుత్రికను సంతానంగా పొందారు. దూదేకుల కులానికి చెందిన సిద్దయ్య, దళితుడైన కక్కయ్యను శిష్యులుగా స్వీకరించారు. శిష్యగణ సమేతంగా దేశ నలుమూలల సంచరించి వేదాంతతత్వ ప్రచారం చేశారు.కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మసంస్థాపనం గావిస్తామన్నారు. 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది. ఏటా..స్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ నెల 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలి రానున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, మఠం నిర్వాహకులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు. – వి.మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడపఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్య బృందం, భక్తులు.. ఆరాధన, గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలు 9 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిõషేకం, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి.అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 4న శేషవాహనోత్సవం, 5న గజవాహనోత్సవం, 6న నరనంది ఉత్సవం, 7న నంది ఉత్సవం, 8న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 7న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామివారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 9న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
ముక్తి పథం.. బ్రహ్మ రథం
బ్రహ్మంగారిమఠం(అన్నమయ్య జిల్లా): పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాల్లో భాగంగా గురువారం బ్రహ్మంగారు, గోవిందమాంబల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు మఠం పెద్దాచార్యులు భద్రయ్య ఆధ్వర్యంలో రథం ప్రారంభానికి సిద్ధమైంది. ముందుగా రథం నిర్మాణ ఉభయ దాతలకు సన్మానం చేశారు. అనంతరం దివంగత మఠాధిపతి పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి దంపతులతోపాటు ఆయన తమ్ముళ్లు, రెండవ భార్య కుమారులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు స్థానిక మఠం మేనేజర్ ఈశ్వరాచారితో కలిసి రథం వద్దకు చేరుకోగానే ఆలయ పూజారులు పూజలు చేశారు.అనంతరం గోవింద నామ స్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీఓ వెంకటరమణ, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం పరిపాలన ఫిట్పర్సన్ శంకర్ బాలాజీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, ఈశ్వరీదేవిమఠం పీఠాధిపతి వీరశివకుమారస్వామి పాల్గొన్నారు. కిక్కిరిసిన భక్తజనం వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మంగారు, గోవిందమాంబలను కళ్లారా చూసి తరించారు. వర్షం వస్తున్నా లెక్క చేయకుండా రథోత్సవాన్ని తిలకించేందుకు గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులు వేచి ఉండడమేగాకుండా రథోత్సవం ముగిసేంత వరకు ఉన్నారు. రథోత్సవ శుభ్రత బాధ్యత లింగాలదిన్నెపల్లె భక్తులదే ఆరాధన మహోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవ శుభ్రత బాధ్యతను మండలంలోని లింగాలదిన్నెపల్లె భక్తుడు ఎల్.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన భక్తులు మూడు రోజుల పాటు చేపట్టారు. గురువారం రథోత్సవం రోజు కూడా కీలకంగా వ్యవహరించారు. రాత్రి గజవాహనోత్సవంలో బ్రహ్మంగారు, గోవిందమాంబలు పురవీధుల్లో తిరిగారు. భారీ పోలీసు బందోబస్తు: మైదుకూరు డీఎస్పీ మురళీదర్‌గౌడ్, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిల ఆధ్యర్యంలో ఎస్ఐ విద్యాసాగర్ పర్యవేక్షణలో జిల్లా నుంచి సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సీలతోపాటు 400 మంది పోలీసులు, హోంగార్డులు, మహిళా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. -
మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్!
కేశంపేట: ఓ ప్రమాదంలో మాట కోల్పోయిన వ్యక్తికి తిరిగి మాటలు వచ్చాయన్న ఉదంతం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం చర్చనీయాంశమైంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడ్డాడు. బ్రెయిన్‌కు గాయాలవ్వడంతో అతడు మాట కోల్పోయాడు. వైద్యులను సంప్రదించగా రూ.3లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. (చదవండి: స్టంట్లు చేస్తున్నారా.. జర జాగ్రత్త.. పోలీసులు ఇంటికే వచ్చేస్తారు!) అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులు అలాగే వదిలేశారు. ఈ క్రమంలో గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో కలిసి బ్రహ్మచారి సైతం వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష చేపట్టాడు. దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఆదివారం ఉదయం ఆలయ గర్భగుడిని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటగా గర్భగుడిలో ఉంటేనే మాటలు రావడం.. బయటికి వస్తే రాకపోవడం గమనించారు. దీంతో స్వామివారికి 11బిందెలతో అభిషేకం చేయడంతో మాటలు పూర్తిగా రావడం మొదలైంది. గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో ఈ అద్భుతం జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గతంలో మాటలు రాలేదని.. తిరిగి రావడం వాస్తవమేనని పలువురు స్థానికులు ధ్రువీకరిస్తున్నారు. కాగా, దీనిపై డిప్యూ టీ డీఎంహెచ్ఓ దామోదర్ వివరణ కోరగా బ్రెయిన్‌కు గాయం అయినప్పుడు ఇలా మాటలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. గాయం మానినప్పుడు అనుకోని పరిణామాల్లో తిరిగి రావచ్చని అభిప్రాయపడ్డారు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి) -
బ్రహ్మయ్యా.. కానుకలు దోచేస్తున్నారయ్యా..!
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో అక్రమాల పర్వం కొనసాగుతోంది. దేవస్థానంలో దీపారాధన కోసం భక్తులు కానుకగా ఇచ్చిన నూనె డబ్బాలను సైతం పక్కదారి పట్టిస్తూ స్థానికులకు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామికి తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్నాటక ,మహారాష్ట్రలలో కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఇక్కడికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి వెళుతుంటారు. బి.మఠంలో ప్రతి ఏడాది మూడు ఉత్సవాలు జరుగుతాయి. అందులో ప్రధానమైనది బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో స్వామికి వివిధ రకాల నూనె డబ్బాలు సమర్పించుకుంటారు. స్వామికి దీపారాధనలకే కాకుండా ఇతర అవసరాలకు వంట నూనెలు కూడా ఇస్తారు. వీటిని అధికంగా సమీపంలో ఉన్న మఠాధిపతి ఇంటిలో ఉంచుతారు. వీటితోపాటు మామూలు రోజులలో కూడా నూనె డబ్బాలతో పాటు బియ్యం, కందిపప్పు, దుస్తులు, బెల్లం, ఇతర వంటసరుకులు కూడా భక్తులు ఇస్తుంటారు. ప్రతి ఏడాది దేవస్థానం నిర్వాహకులు బియ్యం, కందిపప్పు, ఇతర వస్తువులను బహిరంగ వేలం వేస్తారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం బియ్యం, మరికొన్ని వస్తువులు బహిరంగ వేలం వేసినట్లు తెలిసింది. ఇందులో నూనె డబ్బాలు లేవు. శనివారం సాయంత్రం మఠాధిపతి ఇంట్లోనుంచి పోరుమామిళ్లకు చెందిన నూనెల వ్యాపారి ఆముదము, వంట నూనెల 25 కేజీల 50 డబ్బాలు తరలిస్తుండగా స్థానికులు గమనించారు. భక్తులు బ్రహ్మంగారి దీపారాధనకు, వంటకు ఇచ్చిన నూనె డబ్బాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. బహిరంగ వేలం వేయకుండా మీకు ఎలా విక్రయించారని ప్రశ్నించారు. నూనె వ్యాపారి మాత్రం 50 డబ్బాల నూనెను రూ.50వేలకు కొనుగోలు చేసినట్లు స్థానికులకు తెలిపి వాటిని తరలించుకు పోయాడు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. లక్ష చేస్తుందని తెలుస్తోంది. కాగా వాటిని రూ.50 వేలకు కొనుగోలు చేసినట్లు వ్యాపారి పేర్కొంటున్నా అతనికి రూ.25వేల రూపాయల రసీదు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో గోల్మాల్ జరుగుతోందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. నూనె డబ్బాల అమ్మకంపై స్థానిక మఠం మేనేజర్ ఏమంటున్నారంటే.. ‘భక్తులు ఇచ్చిన బియ్యం, ఇతర వస్తువులు బహిరంగ వేలం వేశాం. ఆ ఆదాయాన్ని మఠం నిధులకు జమ చేశాము. నూనె డబ్బాలు మాత్రం బహిరంగ వేలం వేయకుండా విక్రయించాము. 50 డబ్బాలను రూ.25వేలకు విక్రయించాము’ అని మ ఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. కాగా,నూనె కొనుగోలు చేసిన వ్యాపారిని స్థానికులు విచారిస్తే 50 డబ్బాల నూనెను రూ.50వేలకు కొన్నట్లు చెప్పాడు. మరి మిగిలిన సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్లింది అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
ఆలయంలో నాగుపాము
కుసుమంచి (ఖమ్మం) : ఆలయంలోకి చొరబడిన నాగుపామును చూసిన భక్తులు భయంతో గుడి బయటకు పరుగులు తీశారు. అయితే ఆలయంలోకి ప్రవేశించిన పాము ఎంతకూ వెళ్లకుండా గర్భగుడి బయట ఉన్న ద్వార పాలకుని విగ్రహాల చెంతే పడుకుండిపోయింది. దీంతో దాన్ని భగవంతుని పాముగా భావించిన ఆలయ పూజారి పాముకు పాలు పోసి పూజలు నిర్వహించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మంగళవారం జరిగింది. కాగా ఈ విషయం దావానలంలా పాకడంతో గ్రామస్తులు ఆలయం వద్దకు పోటెత్తారు.