breaking news
valuable gold
-
జగన్నాథ రహస్యం!
లక్షలాది భక్తజనం పాల్గొనే విశ్వవిఖ్యాత రథయాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పూరీ జగన్నాథుని ఆలయం మరోమారు పతాక శీర్షికలకెక్కింది. రాజుల నుంచి మొదలుకుని సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథస్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. ఆదివారం ఆలయం దిగువన ఉన్న ఆభరణాల నిల్వ గది(రత్న భండార్)ని దాదాపు 40 సంవత్సరాల తర్వాత లెక్కింపు కోసం తెరవబోతున్నారు. విషసర్పాలు ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో అత్యయిక ఔషధాలను సిద్ధంచేసి వైద్యులు, పాములు పట్టే వాళ్లను వెంటబెట్టుకునిమరీ పురావస్తు, ప్రభుత్వ అధికారులు లోనికి వెళ్లబోతున్నారు. జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి తదితరాల బరువును తూచి, వాటి నాణ్యతను పరిశీలించి వేరే గదిలో సురక్షితంగా భద్రపరచాలని నిర్ణయించారు. చాన్నాళ్ల క్రితం గది తాళం చెవులు పోగొట్టి ఒడిశాలోని బిజూజనతాదళ్ సర్కార్ ఆలయ సంపద సంరక్షణలో విఫలమైందని బీజేపీ అసెంబ్లీ ఎన్నికలవేళ ఆరోపణలు గుప్పించడంతో గది తలుపులు తెరచి సంపదను సరిచూడాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. అయితే గది తెరవడంపై శనివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ శుక్రవారం చెప్పారు.180 రకాల ఆభరణాలు1978లో గదిని తెరచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి మళ్లీ పొడవాటి చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నింటినీ లెక్కించడానికి 70 రోజులు పట్టింది. గదిలో 180 రకాలకు చెందిన అమూల్యమైన ఆభరణాలు స్వామివారికి ఉన్నట్లు సమాచారం. స్వచ్ఛమైన పసిడి ఆభరణాలు 74 రకాలున్నాయి. ఒక్కోటి 100 తులాల బరువైన పురాతన ఆభరణాలూ ఉన్నాయి. ‘‘ 1978లో సంపద లెక్కించారు. అయితే జీర్ణావస్థకు చేరిన కొన్ని ఆభరణాల రిపేర్ పనుల కోసం 1985 జూలై 14వ తేదీన గది తెరిచారు. అప్పుడు నేనూ వెళ్లా. 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 15 చెక్కపెట్టెల్లో ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరిచారు. వెలకట్టలేని ఆభరణాలతోపాటు ఎంతో బంగారం, వెండి నిల్వలు గదిలో దాచారు. పెద్ద సింహాసనం, ఉత్తరభారత భక్తులు జగన్నాథ, బలభద్రులకు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు అక్కడున్నాయి. తర్వాత గది తలుపులు మూసి రెండు రకాల తాళాలు వేసి సీల్వేశారు. తాళం చెవులను ట్రెజరీ ఆఫీస్ నుంచి వచ్చిన కలెక్టర్కు అందజేశాం’ అని ఆనాటి ఆలయ నిర్వహణ అధికారి రవీంద్ర నారాయణ మిశ్రా రెండేళ్ల క్రితం ఒక టీవీచానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంతరాజుల కిరీటాలు, యుద్ధంలో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.2018లో మరోసారి ప్రయత్నించి..పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల పరిరక్షణ నిమిత్తం గది తలుపులు తెరవాలని హైకోర్టు ఆదేశాల మేరకు 2018 ఏప్రిల్ 4వ తేదీన 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది. అయితే తాళం చెవి అదృశ్యమయిందన్న వార్తల నడుమ వెనుతిరిగింది. అయితే కిటికీ నుంచి చూసి గది గోడలు దెబ్బతిన్నట్లు, పైకప్పు పెచ్చులు ఊడినట్లు నిర్ధారించుకున్నారు. ఈ తతంగం అంతా 40 నిమిషాల్లో ముగిసింది. చీకటిగదిని మళ్లీ 40 ఏళ్ల తర్వాత తెరుస్తున్న నేపథ్యంలో ఈసారైనా అన్ని ఆభరణాలు, బంగారం, వెండి నిల్వలను సరిచూసి శిథిల గదికి బదులు నూతన గదిలో సురక్షితంగా దాచాలని సగటు పూరీ జగన్నాథుని భక్తుడు కోరుకుంటున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ. 5కోట్ల విలువైన బంగారం స్వాధీనం; ఇద్దరి అరెస్ట్
నల్గొండ : జిల్లాలోని కోదాడ మండలం నల్లబండ గూడెంలో ఏపీపీఓ బోర్డర్ చెక్ పోస్టు తనిఖీలు నిర్వహించారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు. ఆధారాలు లేకుండా అక్రమంగా తీసుకెళ్తున్న రూ.5.72 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వరుస దొంగతనాలకు పాల్పడే ఇద్దరు గజదొంగలు అరెస్ట్
మహబూబ్నగర్: ఇటు జిల్లా వాసులను అటు పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గజదొంగలను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు గజదొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 42 తులాల బంగారం, 2 కేజీల వెండి, రూ. లక్ష 20 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.